‘తమ్ముడు’ తరవాత నితిన్ కొంత గ్యాప్ తీసుకొన్నాడు. ఈమధ్యే సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థలో ఓ సినిమా మొదలెట్టాడు. ‘ఆయ్’ ఫేమ్ అంజి చెప్పిన కథని కూడా ఓకే చేశాడు. రెండు సినిమాల్నీ సమాంతరంగా ముందుకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నాడు. నాగవంశీతో చేస్తున్న ఈ సినిమాని వీలైనంత త్వరగా విడుదల చేయాలన్నది ప్లాన్. బహుశా ఈ యేడాదే రిలీజ్ చేస్తారేమో..?
అయితే ఈ రెండు కథల కంటే ముందుగా వీఐ ఆనంద్ చెప్పిన స్క్రిప్టు ఓకే చేశాడు నితిన్. ఆ సినిమా ముందుగా పట్టాలెక్కుతుందనుకొన్నారు. కానీ అనూహ్యంగా ఆ తరవాత విన్న కథలు ఫైనల్ అయిపోయాయి. దాంతో వి.ఐ ఆనంద్ సినిమా ఏమైందన్న ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. ఆనంద్ చెప్పిన కథ నితిన్ కి బాగా నచ్చింది. కాకపోతే… బడ్జెట్ ఎక్కువ అవుతోంది. నితిన్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అంతంత బడ్జెట్లు వర్కవుట్ అవుతాయా, లేదా అనే అనుమానాలు ఉన్నాయి. అందుకే నితిన్ ప్రస్తుతం ఉన్న మార్కెట్ కు తగ్గట్టు, ఖర్చు తగ్గించి, దానికి అనుగుణంగా స్క్రిప్టు మార్చే ప్రయత్నాలు జరిగాయి. సెకండాఫ్ లో కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ మార్పులు చేర్పులకు దర్శకుడు ఒప్పుకోలేదని, అందుకే ఈ ప్రాజెక్ట్ పక్కకు వెళ్లిపోయిందని సమాచారం.
ఎప్పుడైతే సితార బ్యానర్ లో సినిమా ఓకే అయ్యిందో, అప్పుడే వి.ఐ.ఆనంద్ ఆ కథని వేరే హీరో దగ్గరకు తీసుకెళ్లాడని తెలుస్తోంది. అయితే నితిన్ కి మాత్రం ఈ కథని వదులుకోకూడదని ఉంది. అందుకే తన నిర్ణయం ఇంకా చెప్పకుండా దోబూచులాడుతున్నాడు. నితిన్ పై, ఆనంద్ కథపై నమ్మకం ఉంచి కావల్సినంత ఖర్చు పెట్టే నిర్మాత దొరికితే… వీలైనంత త్వరగా ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుంది. లేదంటే… బడ్డెట్కి తగిన మరో హీరోని వెదుక్కోవాల్సిందే.
