పోసాని కృష్ణ మురళి ని వెండి తెరపై చూసి చాలా కాలమైంది. సినిమా అనేంటి.. ఓ సినిమా వేడుకలో కూడా ఆయన కనిపించి ఏళ్లకు ఏళ్లయిపోయింది. వైసీపీ సానుభూతిపరుడిగా, ఆ పార్టీ కోసం తెర చాటు నుంచి ఆయన చాలా చేశాడు. ప్రెస్ మీట్లు పెట్టి, వైసీపీ ప్రత్యర్థుల్ని తిట్టాడు. పవన్ కల్యాణ్ పై ఓసారి హద్దులు దాటి, బూతులు అందుకొన్న వైనం ఇప్పటికీ విస్మయ పరుస్తూనే ఉంటుంది. ఆ తరవాత వాటి పర్యవసానాల్ని కూడా ఆయన అనుభవించారనుకోండి.. అది వేరే విషయం. సినిమాల్లో ఉంటూ, రాజకీయాల కోసం, సినిమా నటుల్ని కించపరిచిన వైనం.. ఇండస్ట్రీ పెద్దలకూ నచ్చలేదు. అందుకే ఆయన్ని చాలామంది దర్శక నిర్మాతలు దూరం పెట్టారు. రెగ్యులర్ గా సినిమాలు ఇచ్చే వాళ్లు కూడా పోసానిని పట్టించుకోలేదు. దానికి తోడు పోసాని కూడా చాలా కాలం అజ్ఞాతవాసంలోనే ఉండిపోయాడు. పోసాని చాప్టర్ క్లోజ్ అనుకొంటున్న తరుణంలో మళ్లీ ఆయన సినిమాల్లోకి వచ్చారు. తానే నిర్మాతగా, దర్శకుడిగా ఓ చిన్న సినిమా తీశారు. ఆ సినిమా ప్రమోషన్ల కోసం మీడియా ముందుకు రావాల్సివచ్చింది.
తాను కనిపిస్తే, పొలిటికల్ ప్రశ్నలు సంధిస్తారని, మళ్లీ తనని ఇరకాటంలో పెడతారని పోసానికి బాగా తెలుసు. అందుకే వచ్చీ రాంగానే ‘ఇది సినిమా ప్రెస్ మీట్.. పొలిటికల్ ప్రెస్ మీట్ కాదు’ అని ముందస్తుగానే జర్నలిస్టుల్ని ప్రిపేర్ చేసేశారు. రాజకీయాల ప్రస్తావన తీసుకొస్తే ‘అయ్యా.. చాలా కాలం తరవాత నేను సినిమా చేశాను.. నన్ను చేసుకోనివ్వండి’ అని దండం పెట్టేశాడు. ‘పొలిటికల్ గా ఉంటే ప్రజాసేవ చేయాలి.. జైళ్లకూ వెళ్లాలి’ అంటూ తాను జైలుకి వెళ్లిన వైనాన్ని గుర్తు చేసుకొన్నారు. ఏం మాట్లాడితే, ఏం జరుగుతుందో, నోరు జారితే మళ్లీ ఎలాంటి పర్యవసానాలు ఎదుర్కోవాల్సివస్తుందో అనే భయం పోసానిలో అడుగడుగునా కనిపించింది. తనకు సినిమా అవకాశాలు రావు.. లేవు అని నిర్దారించుకొన్న తరవాతే, ఇక చేసేదేం లేక తన డబ్బులతో తానే ఓ సినిమా తీసుకొన్నాడు. ఇప్పుడు పోసాని తీసిన సినిమా చూడ్డానికి ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా, జనం పట్టించుకొంటారా, లేదా అనేది వేరే డిబేటు. తన ఉనికిని తాను కాపాడుకోవడానికైతే పోసాని ఓ ప్రయత్నం అంటూ చేస్తున్నాడు.
పొలిటికల్ గా ఎదగాలనుకోవడంలో తప్పు లేదు. ఓపార్టీకి వకాల్తా పుచ్చుకోవడంలోనూ పొరపాటు లేదు. కానీ.. అంగబలం చూసుకొని విర్రవీగితే మాత్రం ఇండస్ట్రీలో చాలా చాలా కోల్పోవాల్సి ఉంటుంది. అందుకు పోసాని ఓ నిలువెత్తు నిదర్శనం. ఇప్పటికైతే ఆయన కంట్రోల్ లో ఉంటే మంచిది. కాస్త గ్యాప్ ఇచ్చి, మళ్లీ పొలిటికల్ రొస్టులో యధావిధిగా దిగితే మాత్రం ఈసారి తన కెరీర్ కి పూర్తి స్థాయిలో పుల్ స్టాప్ పడే ప్రమాదం ఉంది.
