వర్షం, ఒక్కడు, మనసంతా నువ్వే… ఇలాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాల్ని తీసిన నిర్మాత ఎం.ఎస్.రాజు. చాన్నాళ్ల క్రితమే ఆయన దర్శకత్వం వైపు దృష్టి నిలిపారు. మెగాఫోన్ పట్టి, తనలోని కొత్త కోణాల్ని బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయాణంలో చేసిన ‘దర్టీ హరీ’ రాజుగారిలోని యూత్ యాంగిల్ ని తట్టి లేపింది. ఇప్పుడాయన హారర్ సినిమా చేశారు. ‘అగధ’ పేరుతో చేసిన మిస్టీరికల్ హారర్ సినిమాని త్వరలోనే విడుదల చేస్తున్నారు. ఈరోజు ట్రైలర్ వదిలారు.
కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ఇది. టైటిల్ కి తగ్గట్టుగానే ‘అగధ’ అనే పాత్ర చుట్టూ నడిచే కథ ఇది. ట్రైలర్లో ఈ పేరు పదే పదే వినిపించింది. అగధ ఎవరు, ఆమె కథేమిటన్నది ట్రైలర్ లో కూడా సస్పెన్స్ గా ఉంచారు. కామాక్షి పాత్ర చాలా పవర్ ఫుల్ గా మిస్టీరియస్‌గా కనిపించింది. హారర్ సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్స్ చాలా కీలకం. వాటిని బాగా వాడినట్టు ట్రైలర్ చెప్పకనే చెబుతోంది. ట్రూ హారర్ సినిమాలు వచ్చి చాలా కాలం అయ్యింది. హారర్, కామెడీ మిక్స్ చేసి అటు భయానికి, ఇటు కామెడీకీ కాకుండా చేస్తున్నారు. ‘అగధ’ మాత్రం పూర్తి స్థాయి హారర్ సినిమాగా కనిపిస్తోంది. తెలుగుతో పాటు మిగిలిన భాషల్లోనూ ఈ సినిమాని విడుదల చేస్తున్నారు.
హారర్ సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ వుంది. ఇటీవల వచ్చిన ‘మసూధ’ ఈ జోనర్ లో చెప్పుకోదగిన సినిమాగా నిలిచింది. ఆ తరవాత అంతగా భయపెట్టే సినిమా రాలేదు. మరి ఆ లోటుని ‘అగధ’ తీరుస్తుందేమో చూడాలి.
