Vaala 2 telugu movie review
తెలుగు360 రేటింగ్ : 2.75/5
ఇంటర్ చదివే నలుగురు కుర్రాళ్ల జీవితంలో చెప్పుకోవడానికి ఏమంత గొప్ప విషయాలు ఉంటాయి? వాళ్ల జీవితంలోనే జరిగిన సంఘటనలను ఆడియన్స్ థియేటర్‌కి వచ్చి మరీ చూస్తారా…? కానీ చూశారు. చూడటమే కాదు, ఇండస్ట్రీ బ్లాక్‌బస్టర్ ఇచ్చారు. మలయాళ పరిశ్రమలో ‘వాలా 2’ ఆ రికార్డు క్రియేట్ చేసింది. కేరళలో విజయవంతమైన ‘వాలా 2’ నిర్మాతల్లో ఒకరైన సాహుగారపాటి, అదే టైటిల్‌తో తెలుగులోకి తీసుకొచ్చారు. మరి అక్కడ అంత ఘన విజయం సాధించిన ఈ సినిమాలోని ప్రత్యేకత ఏమిటి? ‘బయోపిక్ ఆఫ్ ఏ బిలియన్ బ్రోస్’గా వచ్చిన ఈ సినిమా ఎలాంటి ఎమోషన్స్‌ను కదిలించింది?
నలుగురు స్నేహితుల కథ ఇది. హాషిర్, అలన్, అజిన్, వినాయక్ మంచి ఫ్రెండ్స్. ఈ నలుగురికి తోబుట్టువులు ఉంటారు. అందరిదీ దిగువ మధ్యతరగతి నేపథ్యమే. కాలేజీలో పరీక్షలు రాసే సమయానికి ఓ గొడవలో ఇరుక్కుంటారు. పోలీస్ ఆఫీసర్ జేవియర్ (ఆల్ఫోన్స్ పుత్రన్) నలుగురినీ స్టేషన్ కి తీసుకెళ్తాడు. ఆ తర్వాత ఏమైంది? ఆ గొడవ తర్వాత వారి జీవితాలు ఎలా మారాయి? పరీక్షలు రాశారా? లండన్ వెళ్లాలనుకునే వారి కల తీరిందా? వారి జీవితంలో తోబుట్టువులు ఎలాంటి పాత్ర పోషించారు? అనేది మిగతా కథ.
సులభంగా అర్థం కావడం కోసం కథను ఇలా చెప్పాలి కానీ, నిజానికి ‘వాలా 2’ సినిమా గ్లామర్‌కు, గ్రామర్‌కు దూరంగా ఉండే కథ. ఇదొక లైఫ్ ఆఫ్ స్లైస్ జానర్ కథ అనుకోవాలి. జీవితంలోనే చాలా మామూలు, చిన్న చిన్న సంఘటనల సమాహారాన్ని గుదిగుచ్చి ప్రేక్షకులను నవ్వించి, ఎమోషనల్‌గా కదిలించిన తీరు ఇందులో చాలా ప్రత్యేకంగా ఉంటుంది.
నిజానికి ఈ కథను స్క్రిప్ట్ రూపంలో చెబితే వినడానికి చాలా సహనం కావాలి. ఎందుకంటే.. ఇది ఒకరి కథ కాదు. నలుగురు.. ఆ నలుగురికి నలుగురు తోబుట్టువులు, తల్లీతండ్రులు, ప్రేమలు, టీచర్లు, స్కూల్, లండన్ డ్రీమ్స్.. ఒక్కటి కాదు.. ట్యాగ్‌లైన్‌లో చెప్పినట్లు “బయోపిక్ ఆఫ్ ఏ బిలియన్”. కానీ ఆ జీవితాలను దర్శకుడు కెమెరాతో బంధించిన తీరు, పాత్రలని మలిచిన విధానం చూస్తున్న ప్రేక్షకుడిని హత్తుకుంటాయి.
ఒక కుటుంబంలో చావు, పుట్టుకలను చాలా లైటర్ వెయిన్‌లో ఓపెన్ చేస్తూ ఈ కథను మొదలుపెట్టిన తీరు దర్శకుడి అభిరుచిని, తను చెప్పబోయే కథపై ప్రేక్షకుడికి ఒక అంచనాను ఇస్తుంది. ఒక్కో సన్నివేశం గడుస్తున్న కొద్దీ తెరపై మామూలు జీవితాలనే ఆవిష్కరిస్తున్న అనుభూతి కలుగుతుంది. స్కూల్ జరిగే సంఘటనలు, తమ్ముడి కోసం అన్న గొడవలు, థియేటర్లో అల్లరి, సున్తి చేయించే సన్నివేశం.. ఇవన్నీ ఫస్ట్ హాఫ్‌కు కావాల్సిన ఫన్ను అందిస్తాయి.
ఇంటర్వెల్ తర్వాత సినిమా ఒక ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది. పోలీస్ ఆఫీసర్ సీక్వెన్స్ కావాల్సినదాని కంటే ఎక్కువగా సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. ఆ సీక్వెన్స్‌లో లెక్చర్ కూడా ఎక్కువైంది. ఎప్పుడైతే లండన్ డ్రీమ్ మొదలవుతుందో అక్కడి నుంచి కథ మళ్లీ పట్టాలెక్కుతుంది. ఈ సినిమా క్లైమాక్స్‌ను దర్శకుడు సావిన్ రాసుకున్న తీరు మనసును హత్తుకుంటుంది. అన్నదమ్ముల బంధాన్ని ఆవిష్కరించిన తీరు ఈ సినిమాకు ఆయువుపట్టు. నాలుగు పాత్రల నుంచి ఆ ఎమోషన్‌ను దర్శకుడు సమతూకంగా పట్టుకున్నాడు.
హాషిర్, అలన్, అజిన్, వినాయక్.. ఇలా ప్రతి నటుడు తెరపై జీవించాడు. ఎక్కడా ఓవర్ యాక్టింగ్ అనిపించదు. హాషిర్ గర్ల్‌ఫ్రెండ్‌గా చేసిన మారియా కూడా పద్దతిగా కనిపించింది. అందరూ కొత్త కుర్రాళ్లు. న్యూ ఏజ్ యాక్టింగ్ అంటే ఏంటో చూపించారు. రచయిత విపిన్ దాస్ ప్రతి క్యారెక్టర్‌కు ఇచ్చిన పే ఆఫ్ ఈ సినిమాకు వెన్నుముక. మ్యూజిక్, కెమెరా వర్క్, ఎడిటింగ్ కథకు న్యాయం చేశాయి. తెలుగు డబ్బింగ్ కూడా బాగా కుదిరింది. తెలుగు సినిమా డైలాగులు, మీమ్స్ రిఫరెన్స్‌లను డీసెంట్‌గా వాడుకున్నారు.
ఈ సినిమాలో స్టార్లు లేరు. దిమ్మతిరిగే ట్విస్టులు లేవు. కానీ చాలామంది రిలేట్ చేసుకునే జీవితం ఉంది. నవ్వులు, బాధలు, జ్ఞాపకాలు ఉన్నాయి. వీటన్నింటికీ చక్కటి తెరరూపం ఇచ్చిన సినిమా ఇది.
Vaala 2 telugu movie review
తెలుగు360 రేటింగ్ : 2.75/5
