స్టార్ డమ్ కి మురిసిపోయి, మైమరచిపోయే రోజులు కావివి. ఎక్కడైనా కంటెంట్ ఈజ్ కింగ్. ప్రతిభ ఉన్నవాళ్లకే పెద్ద పీట. ‘స్టార్ హీరో సినిమా వచ్చింది’ అంటూ ఎగేసుకుని వెళ్లిపోయే అభిమానం కూడా క్రమంగా కనుమరుగు అవుతోంది. కొత్తవాళ్లపై చిన్న చూపూ లేదు. నచ్చితే తొలి సినిమాకే నెత్తిన పెట్టుకొంటారు. హీరోయిన్ల విషయంలోనూ ఇదే మాట చెల్లుబాటు అవుతోంది. అందుకే కొంతకాలంగా స్టార్ హీరోయిన్లు పెద్దగా ప్రభావం చూపించలేకపోతున్నారు. అనుష్క, తమన్నా పేర్లు తెలుగు హీరోల పక్కన పరిశీలించే చాలా కాలం అయిపోతోంది. కీర్తి సురేష్, పూజా హెగ్డే, సమంత లాంటి స్టార్లు కూడా ఇప్పుడు ఎదురీదుతున్నారు. వీళ్లందరికీ తెలుగులో ఇది పరీక్షా కాలం. ఈ సీజన్ లో గట్టెక్కితే, ఇంకొంత కాలం మనుగడ ఉంటుంది. లేదంటే… ప్రత్యామ్నాయ మార్గాల్ని వెదుక్కోవాల్సిందే.
సమంత ప్రయాణాన్ని రెండు కోణాల్లో చూడొచ్చు. కమర్షియల్ హీరోయిన్గా స్టార్స్ పక్కన నటించింది. ఆ తరవాత లేడీ ఓరియెంటెడ్ సినిమాల్ని నమ్ముకొంది. ఎప్పుడైతే నాయికా ప్రాధాన్యం ఉన్న సినిమాల్ని చేయడం మొదలెట్టిందో, అప్పటి నుంచే స్టార్ హీరోల సినిమాలకు, కమర్షియల్ కథలకు దూరమైంది. అయితే.. తాను సోలోగా చేసిన సినిమాలు కొన్ని సరిగా ఆడలేదు. శాకుంతలం, యశోద బాగా నిరాశ పరిచాయి. ఈ నేపథ్యంలో ‘మా ఇంటి బంగారం’ సినిమా చేసింది. అటు కథానాయికగా, ఇటు నిర్మాతగా ఈ సినిమా తనకు చాలా ముఖ్యం. మే 15న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. సమంత కెరీర్ని డిసైడ్ చేసే సినిమా ఇది.
కీర్తి సురేష్ హవా తగ్గి చాలా కాలం అయ్యింది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా చాలామణి అయిన కీర్తి.. ఉత్తమ నటిగా జాతీయ పురస్కారం అందుకొన్న కీర్తికి ఇప్పుడు తెలుగులో అవకాశాలు రావడమే గగనం అయిపోయింది. వేణు ‘ఎల్లమ్మ’ లో తనని కథానాయిక అనుకొన్నారు. కానీ ఆ ఛాన్స్ కూడా పోయింది. కీర్తికి తెలుగులో అవకాశాలు రావడం గగనమే అనుకొంటున్న అలాంటి తరుణంలో కీర్తి పేరు ఇప్పుడు మళ్లీ గట్టిగా వినిపిస్తోంది. వెంకటేష్ – అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న సినిమాలో తనని కథానాయికగా ఎంచుకొన్నట్టు ప్రచారం సాగుతోంది. విజయ్ దేవరకొండ ‘రౌడీ జనార్థన’ లోనూ తనే కథానాయిక. ఈ రెండు సినిమాలూ కీర్తికి ఆయువు పట్టులాంటివి. కనీసం ఒక్క సినిమా ఆడినా.. మళ్లీ నిలదొక్కుకొనే ఛాన్స్ ఉంటుంది. లేదంటే కీర్తి పేరు మర్చిపోవడమే.
పూజా హెగ్డె.. ఉవ్వెత్తున లేచి పడిన కెరటం. తెలుగు, తమిళ, హిందీ ఇలా అన్ని భాషల్లోనూ చేసింది. కానీ తెలుగులో టాప్ పొజీషన్ కి చేరింది. స్టార్ హీరోల సినిమాల్లో పూజానే మొదటి ఆప్షన్ గా ఉండేది. ఆ తరవాత క్రమంగా అవకాశాలు తగ్గాయి. ఇప్పుడు పూజా పేరు పరిశీలించడమే గగనం అయిపోయింది. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ తో ఓ సినిమా చేస్తోంది. నాని – సుజిత్ కాంబోలో వస్తున్న ‘బ్లడీ రోమియో’ లో హీరోయిన్ గా తన పేరు బలంగా వినిపిస్తోంది. నాని సినిమాలో నిజంగానే ఛాన్స్ వస్తే.. తెలుగులో నిలబడడానికి తనకు మరో ఛాన్స్ దక్కినట్టే.
సమంత, కీర్తి, పూజా… ఈ ముగ్గురికీ ఈ సీజన్ పరీక్షా కాలం. ఇందులో నెగ్గుకు వస్తేనే కెరీర్ అనే సంగతి ఈ కథానాయికలకూ బాగా తెలుసు. మరి ఏమాత్రం కష్టపడతారో, ఏ స్థాయిలో మెప్పిస్తారో రాబోయే సినిమా ఫలితాలే తేల్చి చెబుతాయి.
