బాలీవుడ్ లో ‘ఏక్ దిన్’ సినిమా విడుదలైంది. అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ హీరోగా నటించాడు. అది పక్కన పెడితే మన సాయి పల్లవి ఈ సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టింది. దాంతో ‘ఏక్ దిన్’ ఎలా ఉండబోతోంది? అనే ఆసక్తి తెలుగు ప్రేక్షకుల్లోనూ కాస్త కలిగింది. ఈ సినిమా రిజల్ట్ పై దృష్టి పెట్టారు. అయితే… ‘ఏక్ దిన్’ పేరుకు తగ్గట్టే.. ఒక రోజు సినిమాలా మిగిలిపోయేలా ఉంది. ఈ సినిమాకు బాలీవుడ్ లో ఏమాత్రం స్పందన కనిపించలేదు. అన్నిచోట్లా డిజాస్టర్ టాకే. జునైద్ ఖాన్ కి యాక్టింగ్ సరిగా రాలేదని, సాయి పల్లవి లాంటి నటినీ ఉపయోగించుకోలేదని అక్కడి రివ్యూలు ఘోషించాయి. కథ, కథనాలు పేలవంగా ఉన్నాయని, ఇటీవల విడుదలై, సూపర్ హిట్ కొట్టిన ‘సయారా’ కి ఈ సినిమా కాపీ, పేస్ట్ అంటూ విమర్శకులు పెదవి విరుస్తున్నారు. అమీర్ ఖాన్ అభిమానులకూ ఈ సినిమా నచ్చలేదు. తన వారసుడి సినిమాపై అమీర్ మరింత శ్రద్ధ పెడితే బాగుండేదని సలహా ఇస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి పబ్లిసిటీ కూడా సరిగా చేయలేదు. తూ.తూ మంత్రంగా నడిపించేశారు. దాంతో ఈ సినిమా రిజల్ట్ అమీర్‌కి ముందే తెలుసని, అందుకే ఏ విషయంలోనూ కలగ చేసుకోలేదని అభిప్రాయ పడుతున్నారు నెటిజన్లు.
నిజానికి సాయి పల్లవిది లక్కీ హ్యాండ్. తన కథల ఎంపిక బాగుంటుంది. మరి ఈసారి ఏం జరిగిందో? అయితే ఈ ఫ్లాప్ తో సాయి పల్లవి కెరీర్ ఏం తారుమారు అయిపోదు. ఇప్పటికే తెలుగు డబ్బింగ్ సినిమాలతో హిందీతో తనకంటూ ఓ క్రేజ్ తెచ్చుకోగలిగింది సాయి పల్లవి. తన చేతిల్లో మంచి సినిమాలు ఉన్నాయి. ‘రామాయణ్’ పై సాయి పల్లవి బోల్డంత భరోసా పెట్టుకొంది. ఇందులో సీత పాత్రలో సాయి పల్లవి కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ తో బాలీవుడ్ లో తాను పాగా వేసుకోగలనన్న నమ్మకం ఉంది.
