ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ జీతం ఇప్పుడు అంతర్జాతీయ కార్పొరేట్ రంగంలో హాట్ టాపిక్. టెస్లా కంపెనీ నుండి మస్క్ సుమారు 15 లక్షల కోట్ల రూపాయల విలువైన పరిహారాన్ని 2025 సంవత్సరానికి గాను పొందినట్లు ఇటీవల రెగ్యులేటరీ ఫైలింగ్స్ వెల్లడించాయి. అయితే, ఇందులో అసలు ట్విస్ట్ ఏమిటంటే.. ఇది ఆయనకు నేరుగా అందిన నగదు జీతం కాదు. టెస్లా నిర్దేశించిన అత్యంత కఠినమైన లక్ష్యాలను చేరుకుంటేనే ఈ మొత్తం స్టాక్ ఆప్షన్ల రూపంలో ఆయనకు దక్కుతుంది. ఒకవేళ ఆ టార్గెట్లు రీచ్ కాకపోతే, ఆయనకు ఒక్క రూపాయి కూడా రాదు.
2025లో మస్క్ అందింది సున్నా
గత ఏడాది అంటే 2025లో టెస్లా నిర్ణయించిన మార్కెట్ విలువ , కార్యకలాపాల లక్ష్యాలను చేరుకోకపోవడంతో, మస్క్ పొందిన నిజమైన ఆదాయం సున్నాగా నమోదైంది. మస్క్ జీతానికి సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఆయన గత ఏడేళ్లుగా టెస్లా నుండి ఎలాంటి నెలవారీ జీతం తీసుకోవడం లేదు. 2018లో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం, కంపెనీ ఆదాయం, మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరిగితేనే ఆయనకు వాటాలు లభిస్తాయి. ఏప్రిల్ 2026లో వెలువడిన నివేదికల ప్రకారం, 2018 నాటి పాత ప్యాకేజీని డెలావేర్ సుప్రీం కోర్టు పునరుద్ధరించడంతో, ఆయనకు సుమారు 30.4 కోట్ల షేర్లు దక్కే మార్గం సుగమమైంది. వీటి ప్రస్తుత విలువ లక్షల కోట్లలో ఉన్నప్పటికీ, వీటిని నగదుగా మార్చుకోవాలంటే ఆయన మరో ఐదేళ్ల పాటు ఆ షేర్లను విక్రయించకూడదనే నిబంధన ఉంది.
రిస్కీ..హై రివార్డ్ ప్యాకేజీ
మస్క్ ప్యాకేజీ అనేది ప్రపంచంలోనే అత్యంత రిస్కీ, హై-రివార్డ్ కలిగిన ఒప్పందం. ఒకవేళ టెస్లా మార్కెట్ విలువ 8.5 ట్రిలియన్ డాలర్లకు చేరుకుని, ఏడాదికి 2 కోట్ల కార్లను విక్రయించగలిగితే, రాబోయే పదేళ్లలో ఆయన అందుకునే మొత్తం ఒక ట్రిలియన్ డాలర్లు అంటే సుమారు 90 లక్షల కోట్ల వరకు ఉండవచ్చు. అంటే, కంపెనీ అసాధారణ వృద్ధి సాధిస్తేనే మస్క్ కుబేరుడవుతారు, లేదంటే ఆయన కష్టం అంతా వృథా అవుతుంది.
టార్గెట్లు రీచ్ అయితేనే షేర్లు కూడా !
ఎందుకంటే ఆయనకు నగదు రూపంలో జీతం అందదు, కేవలం షేర్ల రూపంలోనే ఆదాయం ఉంటుంది. 2025లో టార్గెట్లు అచీవ్ చేయకపోవడం వల్ల కొత్తగా ఎలాంటి షేర్లు ఆయనకు దక్కలేదు. కానీ, గతంలో సాధించిన లక్ష్యాల వల్ల ఆయన ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం టెస్లా బోర్డు , వాటాదారులు ఆయనకు ఈ భారీ ప్యాకేజీ ఇవ్వడానికి మొగ్గు చూపడం వెనుక ప్రధాన కారణం.. ఆయన నాయకత్వంలో కంపెనీ విలువ వేల రెట్లు పెరగడమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
