పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో గత పదిహేనేళ్లుగా సాగిన తృణమూల్ కాంగ్రెస్ గుత్తాధిపత్యం నేడు ముగిసింది. 2011లో అసలు ఉనికిలో లేని భారతీయ జనతా పార్టీ , నేడు అఖండ మెజారిటీతో బెంగాల్ పీఠాన్ని అధిరోహించడం వెనుక ఒక చారిత్రక రాజకీయం దాగి ఉంది. నిజానికి, ఈ పతనాన్ని మమతా బెనర్జీ స్వయంగా కోరి తెచ్చుకున్నారు. దశాబ్దాలుగా బెంగాల్‌ను ఏలిన కమ్యూనిస్టులను రాజకీయంగా రూపుమాపాలనే క్రమంలో ఆమె సృష్టించిన రాజకీయ శూన్యత బీజేపీకి ఒక బంగారు అవకాశంగా మారింది.
లెఫ్ట్ పార్టీలను తుడిచిపెట్టేసిన మమత రాజకీయం
2011లో కమ్యూనిస్టులపై అలుపెరుగని పోరాటంతో అధికారంలోకి వచ్చిన మమతా బెనర్జీ, ఆ తర్వాత లెఫ్ట్ పార్టీల క్యాడర్‌ను పూర్తిగా బలహీనపరిచే పనిలో పడ్డారు. వామపక్షాల కార్యాలయాలను మూసివేయించడం, వారి నేతలను వేధించడం వంటి చర్యలతో క్షేత్రస్థాయిలో కమ్యూనిస్టుల ఉనికి దెబ్బతిన్నది. అయితే, దశాబ్దాలుగా సిద్ధాంతపరంగా రాటుదేలిన లెఫ్ట్ కార్యకర్తలు రాజకీయంగా మౌనంగా ఉండలేకపోయారు. టీఎంసీ అరాచకాలపై పోరాడలేక, తమను కాపాడే దిక్కులేక వారంతా సహజంగానే మమతకు ప్రధాన ప్రత్యర్థిగా ఎదుగుతున్న బీజేపీ పంచన చేరిపోయారు. నిన్నటి కమ్యూనిస్టులే నేటి బీజేపీ సైనికులు అన్న రీతిలో బెంగాల్లో ఓట్ల మార్పిడి జరిగింది.
కాంగ్రెస్‌కూ అదే గతి పట్టించారు!
కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన మమత, తన మాతృ పార్టీని కూడా అదే రీతిలో దెబ్బతీశారు. బలమైన ప్రతిపక్షం లేని చోట ప్రజలు ప్రత్యామ్నాయం కోసం చూస్తారనే ప్రాథమిక సూత్రాన్ని ఆమె విస్మరించారు. విపక్షాలను పూర్తిగా నాశనం చేయడంతో ఏర్పడిన ఆ ఖాళీని బీజేపీ తన సంస్థాగత బలంతో, హిందూత్వ ఎజెండాతో భర్తీ చేసింది. 2011లో సున్నా సీట్లున్న బీజేపీ, 2019 పార్లమెంటు ఎన్నికల నాటికి తన బలాన్ని నిరూపించుకుని, నేడు ఏకంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి చేరింది. మమత తన శత్రువును అంతం చేసే క్రమంలో, అంతకంటే బలమైన శత్రువును తానే సృష్టించుకున్నారనేది నేడు అక్షరసత్యమైంది.
మూడింట రెండు వంతుల సీట్లతో బీజేపీ గెలుపు
ప్రస్తుత ఫలితాల్లో బీజేపీ మూడింట రెండు వంతులకు పైగా స్థానాల్లో విజయం సాధిస్తున్నారు. టీఎంసీ 100 మార్కును కూడా దాటలేకపోతోంది. సందేశ్‌ఖాలీ ఉదంతం, ఆర్.జి. కర్ ఘటన వంటివి ప్రజల్లో ఉన్న ఆగ్రహాన్ని మరింత పెంచగా, గతంలో కమ్యూనిస్టుల అండగా ఉన్న గ్రామీణ ఓటర్లు ఇప్పుడు గంపగుత్తగా బీజేపీకి పట్టం కట్టారు. తన ప్రత్యర్థులను లెఫ్ట్ పార్టీల నుంచి బీజేపీ వైపు మళ్లించుకోవడమే మమత చేసిన చారిత్రక తప్పిదమని, ఆ వ్యూహాత్మక లోపమే నేడు ఆమె అధికారం కోల్పోవడానికి ప్రధాన కారణం.బీజేపీ నుంచి మళ్లీ ఆమె అధికారాన్ని చేజిక్కించుకోవడం అంత తేలిక కాదు.
