‘మన శంకర వర ప్రసాద్ గారు’ కంటే ముందే మొదలైన సినిమా ‘విశ్వంభర’. కానీ అనివార్య కారణాల వల్ల ఆ సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఈలోగా ‘మన శంకర వర ప్రసాద్ గారు’ కూడా విడుదలైపోయింది. కానీ.. ఇప్పటి వరకూ ‘విశ్వంభర’ రిలీజ్ పై స్పష్టత రాలేదు. జులైలో ఈ సినిమాని రిలీజ్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే చిత్ర బృందం ఈ విషయమై క్లారిటీ ఇవ్వలేదు.
కాకపోతే… ఈలోగా ఈ సినిమా టీమ్ లో ఓ కీలకమైన మార్పు జరిగినట్టు సమాచారం అందుతోంది. ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం హరి గౌరని తీసుకొన్నట్టు తెలుస్తోంది. హనుమాన్, మిరాయ్ చిత్రాలకు సంగీతం అందించారు హరి గౌర. ఆయా చిత్రాలకు ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి మంచి స్పందన వచ్చింది. పైగా రెండూ డివోషనల్ టచ్ ఉన్న కథలే. ‘విశ్వంభర’ కూడా ఆ తరహా సబ్జెక్టే. అందుకే హర గౌరని ఆర్.ఆర్ కోసం తీసుకొన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన తన వర్క్ కూడా మొదలెట్టేశారని సమాచారం.
మరోవైపు కీరవాణి ‘వారణాసి’ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి సంబంధించి పాటల రికార్డింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. త్వరలోనే ఆర్.ఆర్ కూడా మొదలెడతారు. ‘వారణాసి’ ఒత్తిడి వల్లే… ‘విశ్వంభర’ సినిమాకు కీరవాణి టైమ్ కేటాయించలేకపోయారని తెలుస్తోంది.
