తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమరం ముగింపు దశకు చేరుకుంది. ఎన్డీయే కూటమి తరఫున ప్రచారానికి తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ఫినిషింగ్ టచ్ ఇస్తున్నారు. తమిళ రాజకీయాల్లో చంద్రబాబుకున్న విజనరీ ఇమేజ్, ఆయన వ్యూహాలు ఇప్పుడు ఎన్డీయేకు పెద్ద ప్లస్ పాయింట్‌గా మారతాయని భావిస్తున్నారు.
మహిళా బిల్లు వీగిపోవడం, డీఎంకే ప్రభుత్వం ప్రచారం చేస్తున్న దక్షిణాది వాదం, ప్రాంతీయ సెంటిమెంట్లపై చంద్రబాబు తనదైన శైలిలో కౌంటర్లు ఇస్తున్నారు. అభివృద్ధికి ప్రాంతీయ భేదాలు అడ్డుకాకూడదని, దేశం మొత్తం ఒకే వేగంతో దూసుకుపోతున్నప్పుడు తమిళనాడు వెనుకబడి ఉండకూడదని ఆయన ప్రచారంలో చెబుతున్నారు. డీఎంకే వాదనలు తమిళనాడు ప్రయోజనాలకు విరుద్ధమని, కేంద్రంతో సమన్వయం ఉంటేనే రాష్ట్రానికి భారీ పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు వస్తాయని ఆయన వివరిస్తున్నారు.
తమిళనాడులో తెలుగు ఓటర్లు నిర్ణయాత్మక శక్తిగా ఉన్న నియోజకవర్గాలపై చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు. ఆయన రాకతో అప్పటివరకు స్తబ్దుగా ఉన్న తెలుగు సంఘాలు, సామాజిక వర్గాలు ఒక్కసారిగా యాక్టివ్ అయ్యాయి. డీఎంకే ఏకపక్షంగా విజయం సాధిస్తుందన్న అంచనాలను తారుమారు చేస్తూ, క్షేత్రస్థాయిలో ఇప్పుడు హోరాహోరీ పోరు సాగుతోందని తాజా సర్వేలు చెబుతున్నాయి. దీంతో చంద్రబాబు ప్రచారం ఎంత ఉపయోగపడినా అది ఎన్డీఏకు ప్లస్ అవుతుంది.
ప్రచార పర్వం ముగియడానికి సమయం దగ్గరపడుతుండటంతో, చంద్రబాబు చేస్తున్న ఈ ఫినిషింగ్ టచ్ ఎన్డీయే ఓటు బ్యాంకును ఒక్క శాతం పెంచినా ఎంతో లాభం ఉంటుదంి. కేవలం రాజకీయ ప్రసంగాలకే పరిమితం కాకుండా, నియోజకవర్గాల వారీగా ఉన్న సమస్యలను ప్రస్తావిస్తూ ఆయన చేస్తున్న ప్రసంగాలు ఓటర్లలో ఆలోచన రేకెత్తిస్తున్నాయి. మంగళవారం సాయంత్రం తమిళనాడులో ప్రచారం ముగుస్తుంది. అప్పటి వరకూ ప్రచారం చేసి చంద్రబాబు వెనుదిరిగి వస్తారు.
