ప్రధాని నరేంద్ర మోదీ మే 9న తెలంగాణలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో ఆయన వరంగల్ ఎయిర్పోర్ట్ అభివృద్ధి పనులకు అధికారికంగా శంకుస్థాపన చేయనున్నారు. వరంగల్ చేరుకోగానే ముందుగా ఆయన వరంగల్‌లోని భద్రకాళి దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసే బహిరంగ సభకు హాజరవుతారు. ఇదే వేదిక నుంచి ఎయిర్పోర్ట్ శంకుస్థాపనతో పాటు మరికొన్ని జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులను ప్రారంభిస్తారు.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన నాలుగైదు రోజుల్లోనే వెంటనే మోదీ తెలంగాణ పర్యటనను ఖరారు చేశారు. బెంగాల్ లో బీజేపీ విజయం సాధిస్తే బీజేపీ ఊపు మరో రేంజ్ లో ఉటుంది. రాష్ట్రంలో బలపడుతున్న బిజెపి శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు వరంగల్‌లో నిర్వహించే విజయ సంకల్ప సభ ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. సుమారు 5 లక్షల మందితో ఈ బహిరంగ సభను నిర్వహించాలని రాష్ట్ర బిజెపి నాయకత్వం ప్లాన్ చేస్తోంది.
కేవలం వరంగల్ ఎయిర్పోర్ట్ మాత్రమే కాకుండా, రాష్ట్రంలోని మరికొన్ని పెండింగ్ ప్రాజెక్టులపై ప్రధాని స్పష్టమైన హామీ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. ముఖ్యంగా గిరిజన విశ్వవిద్యాలయం, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వంటి అంశాలపై ఆయన చేసే ప్రసంగంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. రాజకీయంగానూ బీజేపీకి ఈ సభ కీలకమయ్యే అవకాశాలు ఉన్నాయి.


