తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో వాడిన నెయ్యి కల్తీ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ తన దర్యాప్తును ముగించింది. ఈ నెల 30న రాష్ట్ర ప్రభుత్వానికి మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ కమిటీ తన తుది నివేదికను సమర్పించనుంది. తిరుమలలో నెయ్యి నాణ్యత, సేకరణ ప్రక్రియలో జరిగిన లోపాలు కల్తీకి గల మూలాలు, వ్యక్తుల పేర్లను ఇందులో పొందుపరిచినట్లు తెలుస్తోంది.
గత ప్రభుత్వ హయాంలో లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందనే ఆరోపణలపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ పర్యవేక్షణలోని ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ చేసింది. ఈ సిట్ తన నివేదికను సమర్పించి, నెల్లూరు ఏసీబీ కోర్టులో చార్జిషీటు కూడా దాఖలు చేసింది. అయితే, ఈ నివేదిక ఆధారంగా లోపాలను సరిదిద్దేందుకు , బాధ్యులపై చర్యలకు సిఫార్సు చేసేందుకు ఏపీ ప్రభుత్వం దినేష్ కుమార్ కమిటీని నియమించింది. ఆయన విచారణ పూర్తి చేశారు.
ఈ కమిషన్ రిపోర్టుపై వైసీపీ సుప్రీంకోర్టుకు కూడా వెళ్లింది. రాష్ట్ర ప్రభుత్వం సమాంతరంగా మరో కమిటీని వేయడం చట్టవిరుద్ధమని, ఇది రాజకీయ ప్రేరేపితమని విమర్శలు చేసింది. అయితే సుప్రీంకోర్టు కూడా ఈ వాదనను తిరస్కరించింది. ప్రభుత్వం సిట్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునేందుకు మార్గం సుగమమైంది. దినేష్ కుమార్ అందించే నివేదిక తర్వాత కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
