బయోపిక్‌లకు ఓ సీజన్ అంటూ లేదు. ఎప్పుడు పడితే అప్పుడు జీవిత కథలు తెరపైకి తీసుకొచ్చేయడానికి ప్రయత్నిస్తుంటారు. బాలీవుడ్ లో బయోపిక్‌లపై క్రేజ్ ఇంకాస్త ఎక్కువ. ముఖ్యంగా సినీ తారల కథల్ని తెరపైకి తీసుకురావడానికి అక్కడ ఎక్కువ మక్కువ చూపిస్తుంటారు. తాజాగా రాజేష్ ఖన్నా బయోపిక్ పై దృష్టి మళ్లింది. భారతదేశపు తొలి తరపు సూపర్ స్టార్లలో రాజేష్ ఖన్నా ముందు వరుసలో ఉంటారు. వరుసగా 15 సూపర్ హిట్లు కొట్టిన అరుదైన రికార్డ్ ఆయన సొంతం. రాజేష్ ఖన్నాకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఎవ్వరికీ ఉండదని ఇప్పటికీ చెబుతూనే ఉంటారు. ముఖ్యంగా అమ్మాయిల్లో ఆయనకు అభిమానులు ఎక్కువ. రక్తంతో ప్రేమలేఖలు రాసేవారు. ఆఖరికి కారు కనిపించినా వదిలిపెట్టేవారు కాదు. ‘ఇది రాజేష్ ఖన్నా కారు’ అని చెబితే, ఆ కారులో ఆయన లేకపోయినా.. ఆ డోరు మీద.. లిప్ స్టిక్ ముద్రలు గురుతుగా వదిలేవారు. ఇంతటి రాజేష్ ఖన్నా.. స్టార్ డమ్ కూడా ఒక్కసారిగా కుప్పకూలింది. ఆయనపై చాలా కథనాలు, పుకార్లు. ఆఖరికి ఆయన మరణం కూడా ఇప్పటికీ సందేహమే. ఆయా అంశాలు జోడించి ఎన్నో పుస్తకాలు కూడా వచ్చాయి. వాటిలో ఓ పుస్తకాన్ని ఆధారంగా తీసుకొని రాజేష్ ఖన్నా బయోపిక్ నిర్మించే ఆలోచనలో ఉన్నారు. దర్శకురాలు ఫరా ఖాన్ అప్పట్లో ఈ బయోపిక్ తీయాలని చాలా ప్రయత్నించారు. కానీ కుదర్లేదు. ఇప్పుడు ఆమెనే ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారా, లేదంటే.. మరొకరు ఈ బాధ్యత చేపడతారా అనేది చూడాలి.
అన్నట్టు.. రాజేష్ ఖన్నా పాత్ర కోసం టాలీవుడ్ నుంచి ఓ యువ హీరోని సంప్రదించిందట నిర్మాణ సంస్థ. అయితే ఆ యువ హీరో సున్నితంగా తిరస్కరించాడు. రాజేష్ ఖన్నా ఇమేజ్ ని, ఆయన స్టైల్ నీ మ్యాచ్ చేయడం కష్టమని ఈ ఆఫర్ ని ఆ హీరో వదులుకొన్నట్టు తెలుస్తోంది. మరి ఈ క్రేజీ బయోపిక్ లో కనిపించేది ఎవరో, ఆ సినిమాని డైరెక్ట్ చేసేది ఎవరో తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాలి.


