తమిళ వెట్రి కళగం అధినేత విజయ్ తమిళనాడులో పోలింగ్ రోజున నెలకొన్న రవాణా అస్తవ్యస్తతపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఘాటైన లేఖ రాశారు. చెన్నై సహా ప్రధాన నగరాల్లో వేలాది మంది ఓటర్లు బస్టాండ్లలో నిలిచిపోవడంపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఓటు వేయడం అనేది రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని, సరైన రవాణా సౌకర్యాలు కల్పించకపోవడం వల్ల సామాన్య ఓటర్లు తమ హక్కును వినియోగించుకోలేకపోతున్నారని లేఖలో విమర్శించారు.
చెన్నైలోని కోయంబేడు, కిలాంపాక్కం, మాధవరం వంటి కీలక బస్ టెర్మినల్స్‌లో వేలాది మంది ఓటర్లు గంటల తరబడి బస్సుల కోసం నిరీక్షిస్తున్నారని విజయ్ తన లేఖలో పేర్కొన్నారు. ఎన్నికల విధులకు పెద్ద ఎత్తున బస్సులను వినియోగించడం వల్ల సాధారణ ఓటర్లకు రవాణా సౌకర్యం లేకుండా పోయిందని, ఇది ఒక రకమైన ప్రణాళికాబద్ధమైన అసమర్థత అని ఆయన విమర్శించారు. ఈ వ్యవస్థీకృత వైఫల్యం వల్ల చాలా మంది ఓటర్లు పోలింగ్ బూత్‌లకు చేరుకోలేక ఓటు వేయకుండానే వెనుదిరిగే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి విజయ్ ఎన్నికల సంఘం ముందు మూడు ప్రధాన డిమాండ్లను ఉంచారు. బస్టాండ్లలో చిక్కుకుపోయిన ఓటర్లను వెంటనే వారి వారి నియోజకవర్గాలకు తరలించడానికి అత్యవసరంగా ప్రభుత్వ బస్సులు, షటిల్ సర్వీసులను ఏర్పాటు చేయడం, రవాణా అంతరాయాల వల్ల ఆలస్యంగా చేరుకునే ఓటర్ల కోసం పోలింగ్ సమయాన్ని రాత్రి 8 గంటల వరకు పొడిగించడం, పోలింగ్ బూత్‌ల వద్ద క్యూ మేనేజ్మెంట్ను మెరుగుపరచి, ఓటర్లు త్వరగా ఓటు వేసేలా చూడటం చేయాలన్నారు.
ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్న పౌరుడు పరిపాలనా లోపాల వల్ల ఓటు వేయలేకపోవడం ప్రజాస్వామ్యానికే అవమానమని విజయ్ స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం కేవలం మూగప్రేక్షకుడిలా ఉండకుండా వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు. తమిళనాడు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌కు కూడా ఈ లేఖ ప్రతిని పంపిస్తూ, ఓటర్లు తమ బాధ్యతను నెరవేర్చడానికి అవసరమైన అన్ని వెసులుబాటులను కల్పించాలని విజయ్ తన లేఖలో విజ్ఞప్తి చేశారు.
