‘మత్తు వదలరా’ సినిమాతో దర్శకుడిగా తానేంటో నిరూపించుకొన్నాడు రితీష్ రానా. సీక్వెల్ తో కూడా హిట్టు కొట్టాడు. ఇప్పుడు సత్య హీరోగా ‘జెట్లీ’ సినిమా రూపొందించాడు. మే1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘మత్తు వదలరా 3’ ప్లానింగ్ లో ఉంది. ‘జెట్లీ’ హిట్ అయితే, పార్ట్ 2 కూడా తీసే ప్లాన్ ఉంది. అయితే ఈలోగా ఓ హారర్ సినిమాని తెరకెక్కించాలనుకొంటున్నాడు రితీష్. దానికి తగిన స్క్రిప్టు కూడా సిద్ధంగా ఉందని తెలుస్తోంది. ‘మత్తువదలరా’ ఎలాగైతే కొత్తవాళ్లతో రూపొందించారో, అలానే ఈ హారర్ సినిమా కూడా పూర్తిగా కొత్త వాళ్లతో తెరకెక్కించే అవకాశం ఉంది. ‘జెట్లీ’ తరవాత రితీష్ నుంచి రాబోయే సినిమా ఇదే. బ్యానర్ ఏమిటి, ఈ సినిమాలో ఎవరెవరు నటిస్తారు? అనే విషయాలు త్వరలో తెలుస్తాయి.
మరోవైపు ‘జెట్లీ’ సినిమాపై గట్టి ఆశలు పెట్టుకొన్నాడు రితీష్. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లు కూడా చాలా ఆసక్తిగా సాగుతున్నాయి. సినిమాలో ఎంత ఫన్ ఉందో తెలీదు కానీ, ప్రమోషన్ కంటెంట్ లో చాలా ఫన్ కనిపిస్తోంది. ఇదే ఫన్ థియేటర్లోనూ ఉంటే, సినిమా వర్కవుట్ అయిపోయినట్టే. తన గత సినిమాల్లో అక్కడక్కడ చిరంజీవికి సంబంధించిన రిఫరెన్సులు కనిపిస్తాయి. అదే సెంటిమెంట్ ని ‘జెట్లీ’లోనూ రితీష్ కొనసాగించినట్టు తెలుస్తోంది. టీవీ సీరియల్స్ పై కూడా యధావిధిగా ఓ సెటైర్ వేశాడట. మరి అవన్నీ ఏ మేరకు వర్కవుట్ అయ్యాయో తెలియాలంటే మే 1 వరకూ ఆగాల్సిందే.
