ఈరోజుల్లో సినిమాని అనుకొన్న బడ్జెట్ లో పూర్తి చేయడం నిర్మాతలకు ఛాలెంజ్ గా మారింది. మేకింగ్ కంటే… పారితోషికాలకు ఎక్కువ ఖర్చు చేయాల్సివస్తోంది. ఈ విషయంలో కాస్త కఠినంగా ఉండాల్సిన అవసరం ఉంది. పారితోషికాలు తగ్గించుకొని, ఆ మేరకు మేకింగ్ క్వాలిటీపై ఖర్చు చేస్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
కథానాయకుడు రామ్ కూడా ఈ విషయంపై దృష్టి పెడుతున్నారు. ఆయన స్వీయ దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి రామ్ నిర్మాత గా కూడా వ్యవహరిస్తున్నారు. దర్శకుడిగా ఆయనకు ఇదే తొలి సినిమా. కాబట్టి.. అన్ని విషయాల్లోనూ తగిన జాగ్రత్తలు తీసుకొంటున్నారు. మరీ ముఖ్యంగా బడ్జెట్ విషయంలో.
ఈ సినిమాలో విలన్ గా ఎస్.జె.సూర్య పేరు పరిశీలించారు. ఆయన్ని కలిసి కథ కూడా చెప్పారు. అయితే పారితోషికం రూ.8 కోట్లు డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. అందుకే ఈ ఆప్షన్ని రామ్ పక్కన పెట్టారు. హీరోయిన్ విషయంలోనూ ఇంతే. కథానాయికగా శ్రీనిధి శెట్టి ని అనుకొన్నారు. తను ఏకంగా కోటిన్నర డిమాండ్ చేస్తోందట. అందుకే మరో ఆప్షన్ వెదుకుతున్నారు. కయాడు లోహార్ గానీ, సంయుక్తని గానీ ఎంచుకోవాలని భావిస్తున్నారు. కయాడు బెస్ట్ ఆప్షన్. కానీ ఆమె డేట్లు సర్దుబాటు చేయాల్సివుంది. ఆమె కూడా దొరక్కపోతే.. అప్పుడు సంయుక్తని ఎంచుకొంటారు. ఇదంతా.. బడ్జెట్ ని కంట్రోల్ లో చేయడంలో భాగమే. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లబోతోంది. ఈలోగా కథానాయిక, విలన్ పాత్రలపై ఓ క్లారిటీ వస్తుంది.
