జాతీయ రాజకీయాల్లో అత్యంత క్లిష్టమైన పనులను సైతం సైలెంట్‌గా పూర్తి చేసే ట్రబుల్ షూటర్ గా అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ మరోసారి తన సత్తా చాటుకున్నారు. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ లోక్‌సభ పక్షాన్ని నిలువునా చీల్చి, ఏకంగా 20 మందికి పైగా ఎంపీలను ఎన్డీఏ కూటమి వైపు తిప్పిన తాజా రాజకీయ భూకంపం వెనుక అసలు మాస్టర్ మైండ్ సీఎం రమేశేనని ఢిల్లీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల అపార నమ్మకాన్ని సొంతం చేసుకున్న ఆయన.. తెరవెనుక ఉండి నడిపిన ఈ ఆపరేషన్ బెంగాల్ సక్సెస్‌తో దేశ రాజధానిలో అత్యంత పవర్ఫుల్ లీడర్‌గా అవతరించారు.
రమేశ్‌కే స్పెషల్ టాస్క్!
గతంలో రాజ్యసభ సభ్యుడిగా ఉన్న కాలంలోనూ, ఆ తర్వాత జరిగిన పలు కీలక రాజకీయ పరిణామాలలోనూ సీఎం రమేష్ ఆపరేషన్ల నిర్వహణ సామర్థ్యాన్ని ప్రధాని మోదీ, అమిత్ షా ప్రత్యక్షంగా చూశారు. అందుకే ఈసారి బెంగాల్లో తృణమూల్ అంతర్గత సంక్షోభాన్ని క్యాష్ చేసుకునే బాధ్యతను ఎలాంటి మొహమాటం లేకుండా నేరుగా సీఎం రమేశ్‌కే అప్పగించారు. బెంగాలీ ఎంపీల అసంతృప్తిని పసిగట్టడం, వారిని ఏకతాటిపైకి తేవడం, లీగల్ చిక్కులు లేకుండా త్రిపురకు చెందిన ఎన్సీపీఐ లో విలీనం చేసేలా రూట్ మ్యాప్ గీయడం వరకు ప్రతి అంశాన్ని అమిత్ షా పర్యవేక్షణలో సీఎం రమేశ్ దగ్గరుండి నడిపించారు.
రమేష్ మార్క్ స్కెచ్!
కేవలం ఎంపీలను తీసుకురావడమే కాకుండా.. మమతా బెనర్జీపై రివర్స్ లీగల్ నోటీసులు పంపించేలా సీనియర్ ఎంపీ కాకోలి ఘోష్ దస్తీదార్‌ను రాజకీయంగా సిద్ధం చేయడంలో రమేష్ వ్యూహం పనిచేసింది. ఢిల్లీలోని కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ నివాసంలో జరిగిన కీలక చర్చల నుంచి, రాత్రికి రాత్రే లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా వద్దకు 20 మంది ఎంపీలను తీసుకెళ్లి విలీన పత్రాలు సమర్పించేలా చేయడంలో సీఎం రమేష్ నిర్వహించిన పాత్ర కీలకం
ఎన్డీఏనూ 2/3 దిశగా తీసుకెళ్లడంలో రమేష్ కీలకం
పార్లమెంటులో ఎన్డీఏ బలాన్ని భారీగా పెంచుతూ సీఎం రమేష్ చేసిన ఈ ఆపరేషన్ మోదీ-షా ద్వయాన్ని ఎంతగానో ఆకట్టుకుంది. జూలైలో ప్రారంభం కాబోయే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నాటికి ఎన్డీఏ కూటమిని తిరుగులేని శక్తిగా మార్చడంలో సీఎం రమేష్ చూపించిన కార్యదక్షతకు మెచ్చి.. భవిష్యత్తులో కేంద్ర క్యాబినెట్లో , జాతీయ స్థాయిలో ఆయనకు మరింత కీలకమైన బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని హస్తిన వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.