మరో శుక్రవారం బాక్సాఫీసుని నిరాశ పరిచి వెళ్లిపోయింది. వారం వారం కొత్త సినిమాలు రావడం, వాటిపై బాక్సాఫీసు ఆశలు పెట్టుకోవడం, వసూళ్లు మాత్రం అంతంతమాత్రంగా ఉండడం కొన్ని వారాలుగా మామూలు అయిపోయింది. సంక్రాంతి తరవాత బాక్సాఫీసుని కుదిపేసిన హిట్టే లేదు. ‘రాకాస’, ‘బైకర్’, ‘డెకాయిట్’ ఓకే అనిపించాయి కానీ, పూర్తి స్థాయిలో అలరించలేకపోయాయి. ఈ శుక్రవారం కూడా నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. తెలుగు నుంచి బ్యాడ్ బోయ్ కార్తీక్, తిమ్మరాజుపల్లి టీవీ, పాపం ప్రతాప్, పల్లి చట్టంబి సినిమాలు ప్రేక్షకుల్ని పలకరించాయి. బ్యాడ్ బోయ్ ని జనం బేజారెత్తిపోయారు. వీడు బ్యాడ్ బోయ్ కాదు, వరస్ట్ బోయ్ అన్నట్టు రివ్యూలు వచ్చాయి. నాగశౌర్య కెరీర్లోనే అతి పెద్ద డిజాస్టర్ ఇది.
ఈటీవీ విన్ నుంచి వచ్చిన ‘పాపం ప్రతాప్’ కూడా ప్రేక్షకుల్ని అలరించలేదు. ఈ సినిమాకి కూడా నెగిటీవ్ రివ్యూలు వచ్చాయి. దర్శకుడు నమ్ముకొన్న పాయింటే పూర్తిగా తేలిపోవడంతో సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. పల్లి చట్టంబి సినిమాని పట్టించుకొనేవారే లేరు. ఇది డబ్బింగ్ సినిమా అవ్వడం, ప్రచారం కూడా చేసుకోకపోవడం మైనస్సులు. ఇక కిరణ్ అబ్బవరం నిర్మాతగా రూపొందించిన ‘తిమ్మరాజు పల్లి టీవీ’ కి యావరేజ్ మార్కులు పడ్డాయి. నిర్మాతగా కిరణ్ ప్రయత్నం అభినందించదగినదే అయినా, ఈ సినిమాకు ఓపెనింగ్స్ దక్కలేదు. గత వారం విడుదలైన `డెకాయిట్` ఇంకా కొన్ని థియేటర్లలో ఉంది. దానికి కూడా వసూళ్లేం లేవు. ఎండలు మండిపోవడం, థియేటర్ల దగ్గర ఊరించే కంటెంట్ రాకపోవడం, దానికి తోడు ఐపీఎల్ కూడా ఓ గుదిబండగా మారింది. అందుకే వసూళ్లు ఇలా మందకోడిగా ఉంటున్నాయి. ఏదో ఓ పెద్ద సినిమా వచ్చి, కాస్త హుషారు తీసుకొస్తే బాక్సాఫీసు దగ్గర కళ కనిపించే అవకాశాలు లేవు. మరి అలాంటి సినిమా ఎప్పుడొస్తుందో?
