శనివారం ఉదయం పార్లమెంట్ ఉభయ సభలు ప్రారంభమైన కొద్దిసేపటికే నిరవధికంగా వాయిదా పడ్డాయి. ముఖ్యంగా 131వ రాజ్యాంగ సవరణ బిల్లు శుక్రవారం లోక్సభలో వీగిపోయినందున, శనివారం ప్రభుత్వం ఏదో ఒక కీలక నిర్ణయం తీసుకుంటుందని , తదుపరి వ్యూహంపై ప్రకటన చేస్తుందని అందరూ ఆశించారు. అయితే, ఎలాంటి చర్చా లేకుండానే స్పీకర్ సభను నిరవధికంగా వాయిదా వేసేశారు.
నిజానికి శుక్రవారమే ఈ నిర్ణయం తీసుకోవచ్చు. కానీ ప్రభుత్వం ఏదో ఒక ప్రత్యామ్నాయ మార్గం గురించి ఆలోచించడం వల్లే శనివారానికి సభను వాయిదా వేసి ఉండవచ్చని అనుకున్నారు. నియోజకవర్గాల పునర్విభజన , మహిళా రిజర్వేషన్ల వంటి కీలక అంశాలతో ముడిపడి ఉన్న ఈ బిల్లు వీగిపోవడంతో ఎన్డీఏ తదుపరి వ్యూహాన్ని ఖరారు చేసుకుందని అనుమానించారు. కానీ నిరవధిక వాయిదా వేశారు.
మొత్తం మూడు రోజుల పాటు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తామని ముందుగా చెప్పారు. రెండు రోజుల్లో చర్చ అయిపోయింది. ఓటింగ్ అయిపోయింది. మూడో రోజు ఏదో చేయాలని అనుకున్నారు కానీ.. కేంద్రం వ్యూహాత్మకంగా వాయిదా వేసుకుందని.. ఈ వాయిదాతో తేలిపోయిందని చెబుతున్నారు.
