రేవంత్ రెడ్డి నియోజకవర్గాల పునర్విభజనకు హైబ్రీడ్ మోడల్ సూచించడంపై కేటీఆర్ మండిపడ్డారు. స్వయంగా ఆయన ఒక హైబ్రీడ్ మోడల్ సీఎం అని.. అలాంటి ప్రభుత్వాన్ని నడుపుతున్నారని కేటీఆర్ విమర్శించారు. రేవంత్ రెడ్డి అటు కాంగ్రెస్కు, ఇటు బీజేపీకి ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారని, అందుకే ఆయన నిర్ణయాలన్నీ అయోమయంగా ఉన్నాయని మండిపడ్డారు. హైదరాబాద్లో మూడు కార్పొరేషన్ల ఏర్పాటు వంటి కీలక నిర్ణయాలు తీసుకునే ముందు ఎవరినైనా సంప్రదించారా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఒక మాట, కాంగ్రెస్ పార్టీ మరో మాట కాకుండా.. ప్రభుత్వం ఐక్యంగా మాట్లాడాలని హితవు పలికారు. రేవంత్ రెడ్డి వైఖరి రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తోందని ఆరోపించారు.
లోక్సభ సీట్ల సంఖ్యను 850కి పెంచాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై కేటీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేవలం జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని హెచ్చరించారు. ప్రస్తుతం పార్లమెంటులో దక్షిణాదికి ఉన్న 24 శాతం ప్రాతినిధ్యం * ఏ మాత్రం తగ్గకూడదని డిమాండ్ చేశారు. జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసినందుకు దక్షిణాదిని శిక్షించవద్దని, సీట్ల పెంపు విషయంలో అశాస్త్రీయంగా వ్యవహరిస్తే దక్షిణాది రాష్ట్రాలన్నీ ఏకమై తిరుగుబాటు చేస్తాయని, ఆ పోరాటంలో బీఆర్ఎస్ ముందుంటుందని స్పష్టం చేశారు.
మహిళా రిజర్వేషన్ల బిల్లును స్వాగతిస్తూనే, దాని వెనుక ఉన్న రాజకీయ ఎత్తుగడలను కేటీఆర్ ఎండగట్టారు. మహిళా రిజర్వేషన్లను నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపెట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. రాజ్యాంగ సవరణ, పునర్విభజన పేరుతో ఈ ప్రక్రియను కాలయాపన చేయవద్దని కోరారు.
