నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ వేదికగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి పరిశ్రమల్ని తరిమేస్తాననే ప్రకటనలు చేశారు. సాగర్ డిఫెన్స్ కంపెనీకి భూ కేటాయింపులపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ, తాను మళ్ళీ అధికారంలోకి రాగానే ఆ కంపెనీని అక్కడి నుంచి తరిమేస్తానని, ఆ ఒప్పందాన్ని రద్దు చేస్తానని ప్రకటించారు. జగన్ ఎక్కడికి వెళ్లినా పరిశ్రమలను తరిమేస్తా అనే తరహా వ్యాఖ్యలు చేయడంపై పారిశ్రామిక వర్గాల్లో చర్చ మొదలైంది. అభివృద్ధిని అడ్డుకుంటూ పెట్టుబడిదారులను భయపెట్టే ధోరణిలో ఈ ప్రసంగాలు సాగుతున్నాయి. ఇదంతా కుట్ర ప్రకారమే చేస్తున్నారని అనుమానాలు ఉన్నాయి.
జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ సమీపంలో సుమారు 29 నుండి 40 ఎకరాల భూమిని సాగర్ డిఫెన్స్ సంస్థకు కేటాయించడం వల్ల మత్స్యకారుల జీవనోపాధి దెబ్బతింటుందని జగన్ ఆరోపిస్తున్నారు. ఈ ప్రాజెక్టును కృష్ణపట్నం పోర్టుకు తరలించాలని ఆయన డిమాండ్ చేశారు. హార్బర్ కోసం కేటాయించిన స్థలంలో ప్రైవేటు సంస్థలకు చోటు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తూ, మత్స్యకారులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. గతంలో కూడా విశాఖపట్నంలో పలు ప్రాజెక్టుల విషయంలో జగన్ ఇలాంటి కఠిన వైఖరినే అవలంబించారు. బోగాపురం ఎయిర్ పోర్టు ను రద్దు చేసి భూముల్ని తిరిగిస్తామన్నారు. ఇప్పుడు నేనే కట్టానని అంటున్నారు.
సాగర్ డిఫెన్స్ సంస్థకు కేటాయించిన భూమికి, ఫిషింగ్ హార్బర్ కార్యకలాపాలకు ఎటువంటి సంబంధం లేదని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. అది హార్బర్ పరిధిలోకి వచ్చే స్థలం కాదని, నిరుపయోగంగా ఉన్న భూమిని రక్షణ రంగ ఉత్పత్తి కోసం కేటాయించామని ప్రభుత్వం చెబుతోంది. అయినప్పటికీ, జగన్ మాత్రం వాస్తవాలను పక్కన పెట్టి, కేవలం రాజకీయ లబ్ధి కోసం అబద్ధాలతో మత్స్యకారులలో అభద్రతా భావాన్ని కల్పిస్తున్నారని అధికార పార్టీ నేతలు మండిపడుతున్నారు. పరిశ్రమల వల్ల స్థానికులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయనే కోణాన్ని విస్మరించి, కేవలం వ్యతిరేకతను నూరిపోయడం దురదృష్టకరమని వారు పేర్కొంటున్నారు.
రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్న తరుణంలో బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేత హోదాలో ఉండి కంపెనీలను తరిమేస్తా అని హెచ్చరించడం వల్ల కొత్తగా వచ్చే పెట్టుబడిదారులు వెనకడుగు వేసే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఒకవేళ అధికారంలోకి వస్తే పాత ఒప్పందాలను రద్దు చేస్తామనే సంకేతాలు ఇవ్వడం వల్ల రాష్ట్ర పారిశ్రామిక విశ్వసనీయత దెబ్బతింటుంది. గతంలో ఆయన అదే చేశారు. ఘోరంగా ఓడిపోయారు. అయినా ఇప్పుడు మారడం లేదు.
