జార్ఖండ్ రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగింపు దశకు చేరిన వేళ అక్కడ రాజకీయ సమీకరణాలు ఊహించని మలుపులు తిరిగాయి. గతంలో ఆంధ్రప్రదేశ్ నుండి ప్రాతినిధ్యం వహించి, ఈసారి రేసులో లేరనుకున్న రిలయన్స్ గ్రూప్ ప్రెసిడెంట్ పరిమళ్ నత్వానీ చివరి నిమిషంలో మళ్లీ జార్ఖండ్ నుంచే స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇండస్ట్రీస్ లాబీయింగ్, ఎలక్షన్ మేనేజ్మెంట్లో అపారమైన పట్టున్న నత్వానీ.. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌తో భేటీ అయిన మరుసటి రోజే ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ ఎన్నికల్లో పరిమళ్ నత్వానీకి ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీతో పాటు దాని మిత్రపక్షాలైన జేడీయూ, ఎల్జేపీ, ఏజేఎస్‌యూ పార్టీలకు చెందిన ఎన్డీయే ఎమ్మెల్యేలు ప్రతిపాదకులుగా సంతకాలు చేసి మద్దతు పలికినట్లు తెలుస్తోంది. గతంలో 2008, 2014 లలో ఇదే జార్ఖండ్ గడ్డపై స్వతంత్రుడిగా గెలిచిన పాత రికార్డును తిరగరాయడానికి నత్వానీ తన కార్పొరేట్ అఫైర్స్ బలాన్ని రంగంలోకి దించారు. దీంతో అధికార ఇండియా కూటమిలో జేఎమ్ఎమ్ అభ్యర్థి బైజ్నాథ్ రామ్ విజయం దాదాపు ఖాయమైనప్పటికీ, కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్ ఝా గెలుపు మాత్రం ఇప్పుడు తీవ్రంగా ప్రమాదంలో పడింది.
మరోవైపు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి. విజయసాయిరెడ్డి కూడా జార్ఖండ్ రాజ్యసభ స్థానానికి నామినేషన్ పత్రాలను కొనుగోలు చేయడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. గతంలోనే తాను ఎంపీ పదవికి, క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించిన విజయసాయిరెడ్డి.. ఉన్నట్టుండి జార్ఖండ్ ఎన్నికల్లో నామినేషన్ ఫామ్స్ తీసుకోవడం వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటనేది సస్పెన్స్‌గా మారింది.
నత్వానీకి ఎన్డీయే కూటమి పూర్తి మద్దతు ఇస్తున్న నేపథ్యంలో.. ఓట్ల చీలికను నివారించడానికి విజయసాయిరెడ్డి చివరి నిమిషంలో వెనక్కి తగ్గే అవకాశం ఉందనే ప్రచారం కూడా సాగుతోంది. రెండు రాజ్యసభ స్థానాలున్న జార్ఖండ్‌లో ఇప్పుడు పరిమళ్ నత్వానీ రూపంలో మూడో అభ్యర్థి బరిలో నిలవడంతో పెద్దల సభ ఎన్నికలు ఏకపక్షం కాకుండా ముక్కోణపు పోరుగా మారాయి. నత్వానీ గెలవడానికి అవసరమైన మేజిక్ ఫిగర్ కోసం అధికార కూటమిలోని కొందరు ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కార్పొరేట్ వ్యూహాలతో నత్వానీ మూడోసారి జార్ఖండ్ కోటాలో పార్లమెంట్లో అడుగుపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఇక్కడ విజయసారెడ్డి అక్కడ ఎందుకు జోక్యం చేసుకుంటున్నారన్నదే కీలకం.


