చిరంజీవి – విశ్వంభర
నాగచైతన్య – వృషకర్మ
నిఖిల్ – స్వయంభూ
సాయిధరమ్ తేజ్ – సంబరాల ఏటి గట్టు
ఇవన్నీ హీరోల కెరీర్లో పెద్ద బడ్జెట్ తో రూపొందించిన సినిమాలు. ఇవన్నీ.. ఓటీటీ రైట్స్ కోసం ఎదురు చూస్తున్నాయి. ఈ లిస్టులో ఇంకా చాలా సినిమాలే ఉన్నాయి. చిన్న సినిమాల్ని, మీడియం రేంజ్ సినిమాల్నీ కాస్త అటూ ఇటుగా కొనేస్తున్న ఓటీటీ సంస్థలు, భారీ బడ్జెట్ సినిమాల విషయంలో మాత్రం ఆచి తూచి అడుగులేస్తున్నాయి. సినిమా చూసి గానీ కొనడం లేదు. కొన్నా.. గీచి గీచి బేరాలు ఆడుతున్నాయి. వాటికీ, సినిమా బడ్జెట్ కీ పొంతన లేకపోవడంతో, నిర్మాతలు కూడా వచ్చిన రేటకి సినిమాని అమ్ముకొనే ధైర్యం చేయడం లేదు. అలాగని సినిమాల్ని ఓటీటీలు అవ్వకుండా రిలీజ్ చేయలేరు.
ఈ సినిమాల ప్రధాన సమస్య.. బడ్జెట్ పెరిగిపోవడం. మెగాస్టార్ సినిమాని పక్కన పెడితే.. మిగిలిన సినిమాలన్నీ హీరోల ఇమేజ్, మార్కెట్ ని దాటుకొని బడ్జెట్ పెట్టిన సినిమాలే. ఆయా సినిమాలకు ఓటీటీలు గిట్టుబాటు అవ్వాలంటే రికార్డు ధర పలకాలి. కానీ అది జరగడం లేదు.
విచిత్రం ఏమిటంటే.. చిన్న సైజు సినిమాలే ముందస్తుగా ఓటీటీ డీల్ క్లోజ్ చేసుకొంటున్నాయి. ‘గాయపడ్డ సింహం’ మే 1న విడుదల అవుతోంది. ఈ సినిమా ఓటీటీ డీల్ ఎప్పుడో క్లోజ్ అయిపోయింది. సమంత సినిమా ‘మా ఇంటి బంగారం’ కూడా ఓటీటీ డీల్ లాక్ చేసుకొంది. ‘నాగబంధం’ కూడా హెవీ బడ్జెట్ సినిమానే. కాకపోతే అమేజాన్ సంస్థ 27 కోట్లకు ఈ సినిమా కొనుగోలు చేసింది. వీటి మధ్య పెద్ద సినిమాలకు ఓటీటీ అవ్వకపోవడం నిజంగా విడ్డూరమే.
