యాంకర్ విష్ణుప్రియ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఇచ్చే గ్లామర్ పోజులు, అందుకు ఆమె పెట్టిన సబ్స్క్రిప్షన్ ధర చూసి వివాదం చేసిన సోషల్ మీడియా నీతిమంతులు ఇప్పుడు తాము ఎంతటి అమాయకులో అర్థం చేసుకుని ఉంటారు. సమాజాన్ని మేమే కాపాడేయాలి అన్నట్లుగా ఆమెపై విమర్శలు చేసి, ఏకంగా సైబర్ క్రైమ్ పోలీసుల వరకు వెళ్లిన ఈ బ్యాచ్, అసలు విషయం మరచిపోయి ఆమెకు ఉచితంగా కోట్ల రూపాయల మార్కెటింగ్ చేసి పెట్టారు. ఆమె సబ్స్క్రిప్షన్ ద్వారా వచ్చే ఆదాయంపై ఈ సోషల్ మీడియా పోలీసులు చేసిన రచ్చే ఇప్పుడు ఆమెకు కాసుల పంట పండిస్తోంది.
గతంలో ఆమెకు సుమారు 1800 మంది సబ్స్క్రైబర్లు ఉండేవారని, దాని ద్వారా నెలకు 11 లక్షలు సంపాదిస్తోందని లెక్కలు వేసి నానా హంగామా చేశారు. కానీ ఎప్పుడైతే ఈ సోషల్ మీడియా పోలీసులు నైతికత ముసుగులో విమర్శలు మొదలుపెట్టారో, నెటిజన్లలో క్యూరియాసిటీ ఒక్కసారిగా పెరిగిపోయింది. అసలు అక్కడ ఏముందో చూడాలనే కుతూహలంతో జనం ఎగబడ్డారు. ఫలితంగా ఇప్పుడు ఆమె సబ్స్క్రైబర్ల సంఖ్య 4,800 దాటిపోయింది. అంటే కేవలం కొద్దిరోజుల్లోనే ఆమె ఆదాయం మూడింతలు అయింది.
నిజానికి ఆమె చేసింది ఏ చట్టవిరుద్ధమైన నేరం కాదు. ఒక ప్లాట్‌ఫారమ్ ఇచ్చిన ఫీచర్‌ను వాడుకుంటూ, తన స్వేచ్ఛ ప్రకారం కంటెంట్ అందిస్తోంది. అది నైతికమా కాదా అన్నది చూసేవారి ఇష్టం. కానీ సమాజానికి కాపలాదారులుగా ఫీలయ్యే కొందరు ఉత్సాహవంతులు, ఆమెను విమర్శించడం ద్వారా నెగటివ్ పబ్లిసిటీ ఇచ్చి ఆమె వ్యాపారాన్ని రెండింతలు చేశారు. ఆమెకు రూపాయి ఖర్చు లేకుండా పబ్లిసిటీ ఇచ్చి, కొత్త సబ్స్క్రైబర్లను కట్టబెట్టిన ఘనత ముమ్మాటికీ ఈ సోషల్ పోలీసులదే. అబ్బాయిల బలహీనతను క్యాష్ చేసుకుంటోందని ఆరోపించే ఈ మేధావులు, వాస్తవానికి ఒక వ్యక్తిని టార్గెట్ చేయడం వల్ల ఆ వ్యక్తికి ఎంత మేలు జరుగుతుందో మర్చిపోయారు. పబ్లిసిటీ అనేది నెగటివ్ అయినా పాజిటివ్ అయినా, చివరికి అది సెలబ్రిటీల జేబులు నింపడానికే ఉపయోగపడుతుందనే ప్రాథమిక సూత్రాన్ని వీరు గమనించలేకపోయారు. విష్ణుప్రియకు ఇప్పుడు మార్కెటింగ్ మేనేజర్లు అక్కర్లేదు, ఇలాంటి సోషల్ మీడియా పోలీసులు ఉంటే చాలు.
చివరికి జరిగింది ఏమిటంటే, నైతికత గురించి లెక్చర్లు ఇచ్చిన వారు బకరాలయ్యారు, ఆమె బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రం భారీగా పెరిగింది. పరుల వ్యక్తిగత విషయాల్లో దూరి, డిజిటల్ యుగంలో ఎవరు ఎలా బతకాలో తామే నిర్ణయిస్తామని ఉర్రూతలూగే వారికి విష్ణుప్రియ ఆదాయం ఒక చెంపదెబ్బ లాంటిది. ఇకనైనా పరుల స్వేచ్ఛను గౌరవించడం నేర్చుకోకపోతే, ఇలాగే అందరికీ మార్కెటింగ్ ఆఫీసర్లుగా పనిచేసి పెట్టాల్సి వస్తుంది.
