రాయలసీమ ముఖచిత్రం పారిశ్రామికంగా సరికొత్త మలుపు తిరుగుతోంది. ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్, ఆంధ్రప్రదేశ్‌లో తన భారీ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశంలో ఆమోద ముద్ర వేశారు. సుమారు 2,508 కోట్ల పెట్టుబడితో తిరుపతి జిల్లా సత్యవేడులో ఈ యూనిట్‌ను స్థాపించబోతున్నారు.
రాయల్ ఎన్ఫీల్డ్ తన చరిత్రలో తొలిసారిగా తమిళనాడు వెలుపల ఏర్పాటు చేస్తున్న అతిపెద్ద ప్లాంట్ ఇదే . సత్యవేడు మండలంలోని వనెల్లూరు, రాళ్లకుప్పం గ్రామాల్లో దాదాపు 267 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్లాంట్ రూపుదిద్దుకోనుంది. రెండు దశల్లో సాగే ఈ ప్రాజెక్టు ద్వారా రాయల్ ఎన్ఫీల్డ్ తన ఉత్పత్తి సామర్థ్యాన్ని మరో 9 లక్షల యూనిట్లకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ఆంధ్రప్రదేశ్‌ను అంతర్జాతీయ ఆటోమొబైల్ హబ్‌గా మార్చడంలో కీలక పాత్ర పోషించనుంది.
ఈ భారీ పరిశ్రమ ద్వారా రాయలసీమ ప్రాంతంలో సుమారు 5,000 మందికి పైగా ప్రత్యక్ష , పరోక్ష ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. కేవలం తయారీ కేంద్రం మాత్రమే కాకుండా, దీనికి అనుబంధంగా ఒక వెండర్ పార్క్ ను కూడా మొదటి దశలోనే ఏర్పాటు చేయనున్నారు. దీనివల్ల రాయల్ ఎన్ఫీల్డ్కు విడిభాగాలు సరఫరా చేసే చిన్న, మధ్యతరగతి పరిశ్రమలు కూడా ఈ ప్రాంతానికి తరలివస్తాయి. తద్వారా స్థానిక యువతకు ఉపాధితో పాటు ఆయా గ్రామాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడనున్నాయి.
2029 నాటికి మొదటి దశ ఉత్పత్తిని ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్న ఈ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. అనుమతుల మంజూరులో జాప్యం లేకుండా, నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రిలయన్స్, అదానీ వంటి దిగ్గజ సంస్థల పెట్టుబడులతో పాటు రాయల్ ఎన్ఫీల్డ్ రాకతో రాయలసీమ ప్రాంతం పారిశ్రామికంగా కొత్త ఊపిరి పోసుకుంటోంది. రాబోయే రోజుల్లో ఈ ప్లాంట్ ద్వారా తయారయ్యే మేడ్ ఇన్ రాయలసీమ బుల్లెట్లు ప్రపంచ వ్యాప్తంగా గర్జించనున్నాయి.
