ఢిల్లీ రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం కేంద్ర కేబినెట్ మార్పు చేర్పులపై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. మే 16వ తేదీ లేదా ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న గాసిప్ హస్తిన వీధుల్లో బలంగా వినిపిస్తోంది. ఈ విస్తరణ కేవలం ఖాళీలను భర్తీ చేయడం మాత్రమే కాకుండా, రాబోయే రాజకీయ సమీకరణాలకు వేదికగా మారబోతోందని సమాచారం.
ప్రస్తుతం ఒక పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న ఒకరు, తన పదవికి రాజీనామా చేసి కేంద్ర మంత్రివర్గంలో చేరబోతున్నారన్న వార్త రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. సదరు రాష్ట్రంలో నాయకత్వ మార్పు అనివార్యమని అధిష్టానం భావిస్తుండటంతో, ఆ సీనియర్ నేతను ఢిల్లీకి పిలిపించి కీలకమైన శాఖను అప్పగించే అవకాశం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇది నిజమైతే, ఆ రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా పెద్ద మలుపు కానుంది.
మరో ఆసక్తికరమైన గాసిప్ ఏమిటంటే.. ఒక కీలక రాష్ట్రంలో ముస్లిం సామాజిక వర్గానికి చెందిన నేతను ఉప ముఖ్యమంత్రిగా నియమించబోతున్నారట. మైనారిటీలను ఆకట్టుకోవడంతో పాటు సామాజిక సమతుల్యతను కాపాడటానికి ఒక జాతీయ పార్టీ ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. ఈ ప్రయోగం సక్సెస్ అయితే, భవిష్యత్తులో ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే ఫార్ములాను అమలు చేసే అవకాశం ఉంది.
నిజానికి కేంద్ర కేబినెట్ విస్తరణపై చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు అది నిజమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత.. దీనిపై పూర్తి సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంది.
