వైసీపీలో అంతర్గత సంక్షోభం ముదిరిపోతోంది. వెన్నెముకలా నిలిచిన మీడియా, సోషల్ మీడియా , డిజిటల్ విభాగాలు ఇప్పుడు నిలువునా చీలిపోయే ప్రమాదంలో పడ్డాయి. ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ తీవ్ర నైరాశ్యంలో ఉన్న తరుణంలో, తెర ముందు గొంతు వినిపించే విశ్లేషకుల నుంచి తెర వెనుక కంటెంట్ తయారు చేసే టెక్నికల్ టీమ్స్ వరకు అందరిలోనూ అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. గత ఐదేళ్లుగా పార్టీ కోసం పని చేసిన తమను ఇప్పుడు పట్టించుకోవడం లేదని, కనీసం పేమెంట్స్ కూడా సకాలంలో చేయడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
పేమెంట్స్ లో వివక్ష.. కోటరీ రాజకీయం!
వైసీపీ కోసం ఎప్పుడూ కనిపించే, వినిపించే పాషా, కేఎస్ ప్రసాద్ వంటి వారు బహిరంగంగా నిప్పులు చెరుగుతున్నారు. దీనికి వారు చెబుతున్న కారణాలతో అసలేం జరుగుతుందో క్లారిటీ వస్తోంది. సోషల్ మీడియా విభాగంలో పనిచేసే వారికి ఇచ్చే పారితోషికాల విషయంలో తీవ్ర వివక్ష సాగుతోందని సమాచారం. కొందరికి భారీగా ముట్టజెబుతూ, క్షేత్రస్థాయిలో కష్టపడే వారికి మొండిచేయి చూపుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఐప్యాక్ వెళ్ళిపోయిన తర్వాత ఏర్పడిన శూన్యాన్ని పూడ్చడంలో పార్టీ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. పార్టీ కేడర్‌కు, సోషల్ మీడియా టీమ్స్‌కు మధ్య సమన్వయం చేసే నాయకులు ఇప్పుడు కనిపించకుండా పోవడంతో, చాలా మంది తెర వెనుక సైనికులు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. కోపాన్ని పార్టీపై చూపిస్తున్నారు.
సజ్జల సైలెంట్ .. సమాధానం లేని ప్రశ్నలు!
మీడియా , సోషల్ మీడియా వ్యవహారాలను చూస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు ఈ అసమ్మతిని ఆపడంలో చేతులెత్తేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఒకప్పుడు సజ్జల మాటే వేదంగా భావించిన సోషల్ మీడియా విశ్లేషకులు, ఇప్పుడు ఆయన్నే కోవర్ట్ అని విమర్శించే స్థాయికి వెళ్లారంటే పరిస్థితి ఎంత చేయిదాటిందో అర్థం చేసుకోవచ్చు. విశ్లేషకులను బుజ్జగించే ప్రయత్నం చేయకపోగా, వారిని దూరం పెట్టే ధోరణి సజ్జల అవలంబిస్తున్నారని, దీనివల్ల పార్టీకి ఉన్న ఏకైక రక్షణ కవచంగా ఉన్న డిజిటల్ వింగ్ దెబ్బతింటోందని పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.
సంక్షోభంలో వైసీపీ డిజిటల్ విభాగం!
ప్రస్తుతం వైసీపీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇది కేవలం చిన్నపాటి గొడవ కాదు, ఒక పెద్ద సంక్షోభం వైపు దారితీస్తున్నట్లు కనిపిస్తోంది. గెలిచినప్పుడు భజన చేసిన వారంతా ఇప్పుడు కనిపించకుండా పోగా, కష్టకాలంలో పార్టీని సమర్థించే వారిని సజ్జల అండ్ కో పట్టించుకోకపోవడం పెద్ద లోపంగా మారింది. అటు అధికార కూటమి సోషల్ మీడియా దాడులను తట్టుకోలేక, ఇటు సొంత పార్టీ నుంచి గుర్తింపు లేక మధ్యలో నలిగిపోతున్న డిజిటల్ కార్యకర్తలు ఇప్పుడు తిరుగుబాటు బావుటా ఎగురవేస్తున్నారు.
పార్టీలో ఇంత జరుగుతున్నా అధినేత జగన్ మోహన్ రెడ్డి వరకు ఈ విషయాలు వెళ్తున్నాయా? లేదా? అన్నది సస్పెన్స్‌గా మారింది. కోటరీ కేవలం ఆల్ ఈజ్ వెల్ అని మాత్రమే రిపోర్టులు ఇస్తున్నారని, అందుకే కార్యకర్తల ఆవేదన జగన్‌కు చేరడం లేదని పాషా వంటి వారు ఆరోపిస్తున్నారు. కొత్తగా వైసీపీ.. సజ్జల చింపిన విస్తరి అయిపోయిందని కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు.
