పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఒక సుదీర్ఘ శకం ముగిసి, కొత్త అధ్యాయం మొదలవుతున్న వేళ.. ముఖ్యమంత్రి పీఠంపై నరేంద్ర మోదీ, అమిత్ షాల ద్వయం ఎవరిని కూర్చోబెట్టబోతున్నారనే అంశంపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. మమతా బెనర్జీ వారసురాలిగా, బెంగాల్ తదుపరి ముఖ్యమంత్రిగా బిజెపి మహిళా నేత అగ్నిమిత్ర పాల్ పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది.
ఫ్యాషన్ డిజైనర్ టు పొలిటికల్ లీడర్
అగ్నిమిత్ర పాల్ కేవలం రాజకీయ నాయకురాలు మాత్రమే కాదు, అంతర్జాతీయ గుర్తింపు పొందిన ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్. కోల్‌కతాకు చెందిన ఆమె, చిత్ర పరిశ్రమలోని ప్రముఖులకు డిజైనర్‌గా పనిచేసి మంచి గుర్తింపు పొందారు. బెంగాల్ రాజకీయాల్లో మార్పు కోసం 2019లో బిజెపిలో చేరిన ఆమె, అతి తక్కువ కాలంలోనే పార్టీలో కీలక నేతగా ఎదిగారు. ప్రస్తుతం ఆమె పశ్చిమ బెంగాల్ బిజెపి ప్రధాన కార్యదర్శిగా, ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. మమతా బెనర్జీ వంటి ఉద్ధండురాలిని ఢీకొనే క్రమంలో అగ్నిమిత్ర చూపిన తెగువ, స్పష్టమైన వాగ్ధాటి పార్టీ అధిష్టానాన్ని ఆకట్టుకున్నాయి.
దీదీ కి దీటైన మహిళా నేత
పశ్చిమ బెంగాల్‌ను పదిహేనేళ్ల పాటు ఏలిన మమతా బెనర్జీని గద్దె దించిన తర్వాత, ఆ స్థానంలో మరో సమర్థవంతమైన మహిళా నేతను ఉంచడం ద్వారా బెంగాల్ మహిళా ఓటర్లకు బలమైన సంకేతం ఇవ్వాలని మోదీ-షా భావిస్తున్నారు. మమతకు వ్యతిరేకంగా అగ్నిమిత్ర పాల్ నిరంతరం క్షేత్రస్థాయిలో పోరాటాలు చేయడం, జాతీయవాద భావజాలంతో పాటు బెంగాలీ అస్తిత్వాన్ని ప్రతిబింబించేలా ఆమె ప్రసంగాలు ఉండటం ఆమెకు కలిసి వచ్చే అంశాలు. రాష్ట్రంలో బిజెపికి ఉన్న ఇతర సీనియర్ నేతలను కాదని, అగ్నిమిత్రను ఎంచుకోవడం ద్వారా బెంగాల్ రాజకీయాల్లో సరికొత్త మార్పును తీసుకురావాలని అధిష్టానం యోచిస్తోంది.
క్లిష్ట సమయాల్లో అగ్నిమిత్ర పోరాటం
బెంగాల్లో బిజెపి కార్యకర్తలపై దాడులు జరిగినప్పుడు లేదా సందేశ్‌ఖాలీ వంటి సున్నితమైన అంశాలు తలెత్తినప్పుడు అగ్నిమిత్ర పాల్ ముందుండి పోరాడారు. పోలీసుల ఆంక్షలను ధిక్కరించి, వీధుల్లోకి వచ్చి బాధితుల పక్షాన నిలబడటం ఆమెలోని మొండితనాన్ని, నాయకత్వ లక్షణాలను చాటిచెప్పింది. కేవలం గ్లామర్ ఉన్న నాయకురాలు మాత్రమే కాకుండా, క్షేత్రస్థాయిలో క్యాడర్‌ను నడిపించగల సత్తా ఆమెకు ఉందని ఆర్ఎస్ఎస్ కూడా సానుకూల నివేదిక ఇచ్చినట్లు చెబుతున్నారు.
బెంగాల్ రాజకీయాల్లో కొత్త మలుపు
రాష్ట్రాల్లో బీజేపీ గెలిచినప్పుడు ముఖ్యమంత్రుల ఎంపికలో మోదీ, షాలు ఎప్పుడూ అందరి అంచనాలను తలకిందులు చేస్తుంటారు. గతంలో మధ్యప్రదేశ్ , రాజస్థాన్ రాష్ట్రాల్లో కూడా అనుకోని పేర్లను తెరపైకి తెచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు బెంగాల్ విషయంలోనూ అదే మ్యాజిక్ రిపీట్ కాబోతున్నట్లు కనిపిస్తోంది. ఒక ఫ్యాషన్ డిజైనర్ స్థాయి నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయికి అగ్నిమిత్ర పాల్ ఎదుగుదల నిజమైతే, అది బెంగాల్ రాజకీయ చరిత్రలో ఒక సంచలనంగా నిలిచిపోతుంది.
