డిలిమిటేషన్ అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన హైబ్రీడ్ మోడల్ ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు డిలిమిటేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని భావిస్తున్న తరుణంలో, రేవంత్ రెడ్డి తన ప్రతిపాదనతో ఢిల్లీ పయనమయ్యారు. జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచితే దక్షిణాది రాష్ట్రాలకు జరిగే అన్యాయాన్ని అడ్డుకుంటూనే, అటు ఉత్తరాది ప్రయోజనాలను కాపాడేలా ఈ మోడల్ ఉండబోతోందని కాంగ్రెస్ భావిస్తోంది.
కాంగ్రెస్ పార్టీ ఈ హైబ్రీడ్ వ్యూహాన్నే తమ అధికారిక జాతీయ విధానంగా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. మహిళా బిల్లు అమలును డిలిమిటేషన్‌తో ముడిపెట్టడాన్ని ఇప్పటికే ఇండీ కూటమి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. మహిళా రిజర్వేషన్లకు తాము సుముఖమేనని, అయితే డిలిమిటేషన్ పేరుతో దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కడం సరికాదని కూటమి నేతలు వాదిస్తున్నారు. ముఖ్యంగా జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన రాష్ట్రాలు, కేవలం జనాభా తక్కువగా ఉందన్న కారణంతో పార్లమెంట్లో ప్రాతినిధ్యాన్ని కోల్పోవాల్సి రావడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
ఈ విషయంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ అత్యంత కఠినమైన వైఖరిని అవలంబిస్తున్నారు. డిలిమిటేషన్ వల్ల తమిళనాడు వంటి రాష్ట్రాల రాజకీయ ప్రాబల్యం తగ్గుతుందని, దీన్ని అనుమతించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. అవసరమైతే తమిళనాడును దిగ్బంధిస్తామని హెచ్చరించడం ద్వారా కేంద్రానికి గట్టి సంకేతాలు పంపారు. స్టాలిన్ లాంటి నేతల తీవ్ర నిరసనలు , రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన హైబ్రీడ్ మోడల్ తో ఇండీ కూటమి ఒత్తిడి పెంచడానికి ప్రయత్నిస్తోంది.
వచ్చే రెండు రోజుల్లో కేంద్రం ప్రవేశపెట్టబోయే బిల్లులపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. రేవంత్ రెడ్డి తన హైబ్రీడ్ మోడల్‌ను జాతీయ స్థాయిలో ప్రచారం చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీని ఈ వివాదంలో పరిష్కారం చూపుతున్న పార్టీగా నిలబెట్టాలని చూస్తున్నారు. అటు మహిళా బిల్లుకు మద్దతు ఇస్తూనే, ఇటు దక్షిణాది రాష్ట్రాల హక్కుల కోసం పోరాడుతున్నామనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం రేవంత్ ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది.

