తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు తెలపాలని కోరుతూ వివిధ రాజకీయ పార్టీల అధినేతలకు , ఎంపీలకు లేఖలు రాశారు. ఏప్రిల్ 16న పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న ఈ బిల్లుకు పార్టీలన్నీ ఏకగ్రీవంగా మద్దతు పలకాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం ప్రాతినిధ్యం కల్పించాలనే ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పానికి అందరూ బలాన్ని ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.
ఈ లేఖను ముఖ్యమంత్రి కేవలం తన మిత్రపక్షాలకే కాకుండా, ప్రతిపక్ష నేతలకు కూడా పంపడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల, జనసేనాని పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పురందేశ్వరితో పాటు ఉభయ కమ్యూనిస్టు పార్టీల రాష్ట్ర కార్యదర్శులకు ఆయన లేఖలు పంపారు. మహిళల సాధికారత విషయంలో రాజకీయాలకు తావులేకుండా అందరూ ఒక్కటి కావాలని ఆయన కోరారు.
భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఏప్రిల్ 16వ తేదీ ఒక చారిత్రక ఘట్టంగా నిలిచిపోతుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. దశాబ్దాల కాలంగా మహిళా లోకం ఎదురుచూస్తున్న కల ఈ బిల్లుతో సాకారం కాబోతోందని ఆయన పేర్కొన్నారు. చట్టసభల్లో మహిళల భాగస్వామ్యం పెరిగితేనే పరిపాలనలో గుణాత్మకమైన మార్పులు వస్తాయని, అప్పుడే సమగ్ర దేశాభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా, రాబోయే తరాల మహిళా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ చట్టానికి మద్దతు ఇవ్వాలని కోరారు.
ఈ చట్టం అమలులోకి వస్తే పాలనా వ్యవస్థలో మహిళల పాత్ర గణనీయంగా పెరుగుతుందని, ఇది దేశ ఉన్నతికి దోహదపడుతుందని చంద్రబాబు విశ్లేషించారు. నారీ శక్తిని గౌరవించడం భారతీయులందరికీ గర్వకారణమని, చట్టసభల్లో మూడో వంతు స్థానాలు మహిళలకు కేటాయించడం ప్రపంచ ప్రజాస్వామ్య వ్యవస్థలకే ఆదర్శంగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీ ప్రజల తరపున, ముఖ్యంగా రాష్ట్ర మహిళల తరపున ఈ చారిత్రక నిర్ణయం తీసుకున్న ప్రధానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
చంద్రబాబు జగన్‌కూ లేఖ రాయడం హాట్ టాపిక్ గా మారింది. ఎవరూ అడగకపోయినా కేంద్రానికి మద్దతిచ్చే పరిస్థితులో జగన్ ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు అడిగినందున పంతానికి పోయి ఆయన దక్షిణాదికి అన్యాయం జరుగుతుదని మద్దతివ్వకుండా ఉంటారేమోనన్న చర్చలు నడుస్తున్నాయి. అదే జరిగితే జగన్ తన రాజకీయ విధానాన్ని మార్చుకున్నట్లు అవుతుంది.


