ఎం.ఎస్.సుబ్బులక్ష్మి బయోపిక్ కి సంబంధించి పనులు శర వేగంగా సాగుతున్నాయి. గీతా ఆర్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. గౌతమ్ తిన్ననూరి దర్శకుడు. సుబ్బులక్ష్మి పాత్రలో సాయి పల్లవి ని ఎంచుకొన్నారు. ఆమెకు కథ కూడా వినిపించారు. ఈ కాంబో ఖాయమైందన్న తరుణంలో మరో వార్త బలంగా చక్కర్లు కొడుతోంది. సాయి పల్లవి స్థానంలో రుక్మిణి వసంతన్ ని ఎంచుకొన్నారని, ఈ మార్పు తథ్యమన్న వార్తలు షికారు చేస్తున్నాయి. దాంతో సుబ్బులక్ష్మి పాత్రలో సాయిపల్లవి కరెక్టా, రుక్మిణి సరిపోతుందా? అనే చర్చ కూడా మొదలైంది.
అయితే… ఈ బయోపిక్‌లో రుక్మిణి వసంతన్ ని ఎంచుకొన్నారన్న వార్తల్లో నిజం లేదని తేలింది. సాయిపల్లవితోనే ఈ బయోపిక్ పట్టాలెక్కుతుందని, ఈ పాత్రలో సాయి పల్లవి తప్ప మరో ఛాయిస్ లేదని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. సో.. ఈ వార్తలో నిజం లేదన్నమాట. `జెర్సీ` సినిమాతో తానెంటో నిరూపించుకొన్నాడు గౌతమ్ తిన్ననూరి. `కింగ్ డమ్` సినిమా నిరాశ పరిచినా, తనపై నమ్మకాలు సడల్లేదు. ‘సుబ్బులక్ష్మి’ బయోపిక్ కి తనే సరైన దర్శకుడని చిత్రబృందం నమ్ముతోంది. గౌతమ్ కి కూడా ఇది మంచి ఛాన్స్. ఈ వేసవిలోనే ఈచిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్తారు. ఈలోగా మిగిలిన వివరాలు వెల్లడవుతాయి.
