భారత రియల్ ఎస్టేట్ రంగంలో 2025 సంవత్సరం సరికొత్త రికార్డులను సృష్టించింది. దేశవ్యాప్తంగా ప్రముఖ నగరాల్లో డెవలపర్లు భూ సేకరణ కోసం ఎన్నడూ లేని విధంగా భారీ ఒప్పందాలు చేసుకున్నారు. ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ JLL ఇండియా విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, 2025లో డెవలపర్లు దాదాపు 3,093 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. మొత్తం 149 ప్రధాన ఒప్పందాల ద్వారా జరిగిన ఈ లావాదేవీల విలువ సుమారు రూ.54,818 కోట్లుగా తేలింది. గతేడాదితో పోలిస్తే భూ ఒప్పందాల విలువలో 32 శాతం వృద్ధి నమోదు కావడం మార్కెట్ ఉత్సాహాన్ని ప్రతిబింబిస్తోంది.
కేవలం భూమిని కొనుగోలు చేయడమే కాకుండా, ఈ భూముల్లో రాబోయే రెండు నుండి ఐదు ఏళ్లలో భారీ ప్రాజెక్టులను చేపట్టేందుకు డెవలపర్లు సిద్ధమవుతున్నారు. ఈ కొత్త భూముల్లో నిర్మాణాలు పూర్తి చేసేందుకు దాదాపు రూ.92,000 కోట్లకు పైగాఅదనపు నిర్మాణ మూలధనం అవసరమవుతుందని అంచనా. ఇందులో సుమారు రూ. 52,000 కోట్ల మేర బయటి వనరుల ద్వారా సమీకరించాల్సి ఉంటుందని నివేదిక పేర్కొంది. ఇది బ్యాంకులు, ప్రైవేట్ ఈక్విటీ ఫండ్లు , ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్లకు ఒక గొప్ప అవకాశంగా మారనుంది.
మొత్తం జరిగిన భూ ఒప్పందాల్లో దాదాపు 78 శాతం అంటే 2,398 ఎకరాల భూమిని కేవలం నివాస గృహాల కోసమే కేటాయించారు. పట్టణాల్లో గృహాలకు పెరుగుతున్న విపరీతమైన డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని బిల్డర్లు అపార్ట్మెంట్లు, విల్లాలు ,ప్లాట్ల రూపంలో ప్రాజెక్టులను ప్లాన్ చేస్తున్నారు. కేవలం ఈ హౌసింగ్ ప్రాజెక్టుల నిర్మాణానికే రూ.72,000 కోట్ల పెట్టుబడి అవసరమని లెక్కగట్టారు. మిగిలిన భూమిని కమర్షియల్ ఆఫీస్ స్పేస్, లాజిస్టిక్ పార్కులు మరియు డేటా సెంటర్ల కోసం వినియోగించనున్నారు.
పెట్టుబడుల పరంగా చూస్తే టైర్-1 నగరాలైన ముంబై, ఢిల్లీ-ఎన్సీఆర్, బెంగళూరు, హైదరాబాద్ ,పూణే నగరాలు అగ్రస్థానంలో నిలిచాయి. మొత్తం పెట్టుబడిలో 89 శాతం వాటా ఈ మెట్రో నగరాలకే దక్కడం గమనార్హం. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ అత్యంత విలువైన ఒప్పందాలకు వేదికగా నిలిచింది. ఈ భారీ భూ ఒప్పందాలు కేవలం అంకెలకు మాత్రమే పరిమితం కాకుండా, రాబోయే ఐదేళ్లలో దేశవ్యాప్తంగా దాదాపు 22.9 కోట్ల చదరపు అడుగుల కొత్త నిర్మాణ సామర్థ్యాన్ని అందుబాటులోకి తీసుకురానున్నాయని భావిస్తున్నారు.
