ఓటర్ల జాబితా ప్రక్షాళన , సవరణ ప్రక్రియ కోసం కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR-2026 కార్యక్రమం ఆశించిన దానికంటే మెరుగైన ఫలితాలను ఇస్తోంది. ముఖ్యంగా తమిళనాడు, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాను అత్యంత పారదర్శకమైన పద్ధతిలో శుద్ధి చేయడం వల్ల ఓటు హక్కుపై ప్రజల్లో నమ్మకం పెరిగింది. అర్హులైన వారు ఎవరూ ఓటును కోల్పోకుండా, అనర్హులకు తావు లేకుండా చేయడంలో ఈ ప్రక్రియ విజయం సాధించింది.
వివాదరహితంగా SIR ప్రక్రియ
తమిళనాడులో ఈసారి ఓటర్ల జాబితా సవరణ విషయంలో దాదాపుగా ఎటువంటి ప్రధాన వివాదాలు తలెత్తలేదు. ఎన్నికల సంఘం క్షేత్రస్థాయిలో బూత్ లెవల్ ఆఫీసర్ల ద్వారా ఇంటింటి సర్వే నిర్వహించి, మార్పులు చేర్పులను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్డేట్ చేయడం వల్ల ఓటర్లకు పెద్దగా అసౌకర్యం కలగలేదు. అందుకే అక్కడ రికార్డు స్థాయిలో 84 శాతం పైగా పోలింగ్ నమోదయిది. ఫిబ్రవరిలోనే తుది జాబితాలను రాజకీయ పార్టీలకు అందజేయడం, వాటిపై స్పష్టమైన క్లారిటీ ఇవ్వడం వల్ల ఓటింగ్ రోజున మా పేరు జాబితాలో లేదు అన్న విమర్శలకు తావు లేకుండా పోయింది.
బెంగాల్లో సవాలును అధిగమించిన సవరణ
పశ్చిమ బెంగాల్ రాజకీయ వాతావరణం ఎప్పుడూ వేడిగా ఉంటుంది, ముఖ్యంగా ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగాయని ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం సహజం. అయితే ఈసారి ఎన్నికల సంఘం సుమారు 91 లక్షల అనర్హులైన ఓటర్లను తొలగించడం ఒక సాహసోపేతమైన చర్యగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ప్రక్రియలో న్యాయాధికారులను కూడా భాగస్వాములను చేసి, సుమారు 60 లక్షల ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించడం ద్వారా వివాదాలకు ఆస్కారం లేకుండా చేశారు. చివరి నిమిషం వరకు అర్హులందరికీ అవకాశం కల్పించడం వల్ల అక్కడ కూడా 91 శాతానికి పైగా పోలింగ్ నమోదై, ఒక కొత్త రికార్డును సృష్టించింది.
ప్రజాస్వామ్యానికి ప్రాణం.. ఓటర్ కార్డు
ఓటర్ జాబితా ఎంత స్వచ్ఛంగా ఉంటే.. ప్రజాస్వామ్యం అంత బలంగా ఉంటుంది అనే సూత్రాన్ని ఎన్నికల సంఘం అక్షరాలా అమలు చేస్తోంది. 2026 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రవేశపెట్టిన డిజిటల్ రివిజన్ , ఆటోమేటెడ్ సెర్చ్ టెక్నాలజీ వల్ల ఒక వ్యక్తికి రెండు చోట్ల ఓటు ఉండే అవకాశం పోయింది. దీనివల్ల రిగ్గింగ్ వంటి అక్రమాలకు అడ్డుకట్ట పడింది. ఓటరుకు తన హక్కుపై భరోసా కలిగినప్పుడే వారు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు వస్తారు. బెంగాల్ , తమిళనాడులో కనిపిస్తున్న భారీ పోలింగ్ శాతమే ఇందుకు నిదర్శనం.
దిద్దుబాటు చర్యలే దిక్సూచి
గతంలో ఎన్నికల సమయంలో ఓటర్ల జాబితా గందరగోళం వల్ల రాజకీయ పార్టీల మధ్య తీవ్ర ఘర్షణలు జరిగేవి. అయితే ఈసారి ప్రక్రియను ముందే ప్రారంభించి, దశల వారీగా పూర్తి చేయడం వల్ల ఆ అవాంతరాలు తగ్గాయి. టెక్నాలజీని వాడుకుంటూనే, క్షేత్రస్థాయిలో మానవ వనరుల ద్వారా వెరిఫికేషన్ చేయడం వల్ల పొరపాట్లు దొర్లే అవకాశం కనిష్ట స్థాయికి పడిపోయింది. పటిష్టమైన చర్యల వల్ల రాజకీయ పార్టీలు కూడా అనైతిక మార్గాల్లో గెలవడం కంటే, ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవడంపైనే ఎక్కువ దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది.
