అస్సాం రాజకీయ ముఖచిత్రంపై హిమంత బిశ్వ శర్మ అనే పేరు ఇప్పుడు ఒక తిరుగులేని శక్తిగా మారింది. 2026 అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చూస్తుంటే, అస్సాంలో కాంగ్రెస్ పార్టీ మరోసారి కోలుకోలేని దెబ్బ తిన్నట్లు కనిపిస్తోంది. ఒకప్పుడు కాంగ్రెస్‌లో కీలక నేతగా ఉండి, నేడు బీజేపీని వరుసగా మూడోసారి అధికారంలోకి తీసుకువస్తున్న హిమంత ప్రస్థానం భారత రాజకీయాల్లోనే ఒక అరుదైన అధ్యాయం.
రాహుల్ అవమానంతో పార్టీ మారిన బిశ్వశర్మ
హిమంత బిశ్వ శర్మ రాజకీయ జీవితంలో 2015వ సంవత్సరం అత్యంత కీలకమైనది. కాంగ్రెస్ పార్టీలో ఉండగా అస్సాం సమస్యలపై చర్చించేందుకు రాహుల్ గాంధీని కలిసినప్పుడు .. రాహుల్ గాంధీ వారి మాటలు వినకుండా తన పెంపుడు కుక్క కి బిస్కెట్లు వేయడంలో నిమగ్నమయ్యారు. కుక్కలకు బిస్కెట్లు వేస్తున్న అదే ప్లేటులో ఉన్న బిస్కెట్లను అస్సాం నేతలకు కూడా ఆఫర్ చేశారు. ఇది హిమంత ఆత్మాభిమానాన్ని దెబ్బతీసింది. దెబ్బతిన్న ఆ క్షణమే కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన ఆయన, ఈరోజు అస్సాంలో కాంగ్రెస్ ఉనికినే ప్రశ్నార్థకం చేశారు.
బీజేపీ హ్యాట్రిక్ ఖాయం
తాజా ఎగ్జిట్ పోల్స్ ప్రకారం, అస్సాంలోని 126 స్థానాలకు గాను బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి 88 నుండి 100 వరకు స్థానాలు లభించే అవకాశం ఉంది. ఒక్కటంటే ఒక్కటి కూడా కాంగ్రెస్ కూటమి గెలుస్తుందని అంచనా వేయలేదు. సర్వే సంస్థలన్నీ హిమంత బిశ్వ శర్మ మేజిక్‌ను ధ్రువీకరిస్తున్నాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి కేవలం 25-35 స్థానాలకే పరిమితం కాబోతోందని అంచనా. మ్యాజిక్ ఫిగర్ 64ను బీజేపీ కూటమి సునాయాసంగా దాటడమే కాకుండా, దాదాపు మూడింట రెండు వంతుల మెజారిటీ దిశగా దూసుకుపోతోంది.
ఒంటిచేత్తో గెలిపిస్తున్న నేత
హిమంత బిశ్వ శర్మ కేవలం ముఖ్యమంత్రిగానే కాకుండా, పార్టీకి ఒక ప్రధాన వ్యూహకర్తగా మారారు. అస్సాం గుర్తింపు, అభివృద్ధి, సంక్షేమ పథకాలను మేళవించి ఆయన వేసిన వ్యూహాలు ప్రతిపక్షాల దగ్గర సమాధానం లేకుండా చేశాయి. పదేళ్ల నుంచి సీఎంగా ఉన్నా ఇప్పటికీ అధికార వ్యతిరేకత రాలేదు. మహిళలు, యువత మద్దతు హిమంతకే ఉండటం బీజేపీకి పెద్ద ప్లస్ పాయింట్‌గా మారింది. రాహుల్ గాంధీ కుక్క బిస్కెట్ల వ్యవహారాన్ని ప్రతి ఎన్నికలోనూ గుర్తు చేస్తూ, తన ఆత్మాభిమానాన్ని అస్సాం ఆత్మాభిమానంగా మార్చడంలో ఆయన సక్సెస్ అయ్యారు.
అగాధంలో కాంగ్రెస్.. పతాక స్థాయిలో బీజేపీ
ఒకప్పుడు అస్సాంను ఏకధాటిగా పాలించిన కాంగ్రెస్, ఇప్పుడు గౌరవ్ గొగోయ్ వంటి యువ నాయకత్వం ఉన్నప్పటికీ హిమంత ధాటికి నిలవలేకపోయింది. ముస్లిం ఓట్ల చీలిక, సరైన వ్యూహం లేకపోవడం కాంగ్రెస్‌ను ముంచేశాయి. ఎగ్జిట్ పోల్స్ నిజమైతే, అస్సాం మట్టిలో పుట్టి, అవమానాన్ని ఎదుర్కొని ..దానికి ప్రతీకారంగా కాంగ్రెస్ పార్టీని బొందపెడుతున్న నేతగా ఆయన గుర్తింపు సాధించుకుంటారు.