చిత్రసీమలో అందరూ సంతోషంగానే ఉన్నారు. ఒక్క నిర్మాత తప్ప. ఎందుకంటే పోబడే తప్ప, రాబడి ఉండడం లేదు. సినిమాలకు జనం రావట్లేదు. ఓటీటీలు సినిమాల్ని కొనడం లేదు. హీరోల్ని సంతృప్తి పరచడానికీ, దర్శకుడి కథలు, కలలు సినిమాలుగా రావడానికి తన రక్తం చమటోడ్చి సినిమాలు తీస్తున్నారే తప్ప, ఎవ్వరికీ దమ్మిడీ లాభం ఉండడం లేదు. తన సినిమాలకు అయిన ఖర్చు కూడా వెనక్కి రాలేని పరిస్థితి. ఇలాంటి దశలో నిర్మాతలంతా ఓ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిర్మాత బతకాలంటే.. కొంతమేర కఠినంగా ఉండాల్సిన అవసరాలు ఏర్పడ్డాయి. ఈ మేరకు తమిళ నిర్మాతల సంఘం ఓ అడుగు ముందుకేసింది. ఇక మీదట నటీనటులు, సాంకేతిక నిపుణులకు పారితోషికాలు ఇవ్వమని ప్రకటించింది. రెవిన్యూ షేరింగ్ ప్రాతిపదికన పని చేయాలని, లేదంటే సినిమాల్ని తీయలేమని చాలా గట్టిగా స్పష్టం చేసింది నిర్మాతమండలి. దీనిపై అందరూ ఓ నిర్ణయం తీసుకొనేంత వరకూ తమ నిరసన కొనసాగిస్తామని హెచ్చరించాయి. వీటిపై తమిళ నటీనటులు, సాంకేతిక నిపుణులు తమ అభిప్రాయాన్ని ప్రకటించాల్సివుంది.
సినిమా మేకింగ్ కంటే, పారితోషికాలకే ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు దాపురించాయి. రూ.100 కోట్లు పెట్టి సినిమా తీస్తే అందులో రూ.60 నుంచి రూ.70 కోట్లు పారితోషికాలకే వెచ్చించాల్సివస్తోంది. హీరోలు, దర్శకులు, హీరోయిన్లు తమ రెమ్యునరేషన్ తగ్గించుకొంటే నిర్మాతకు వెసులుబాటు ఉంటుంది. పూర్తిగా వదులుకొని, లాభాల్లో వాటా అందుకొంటే అది నిర్మాత పాలిట రక్షణ కవచమే. సినిమా హిట్టయి, మంచి డబ్బులు వస్తే, అందరికీ లాభమే. కానీ… దానికి ఒప్పుకొనేది ఎవరు? చాలామంది హీరోలు చేతిలో అడ్వాన్స్ పడకపోతే, కథ కూడా వినే పరిస్థితుల్లో లేరు. అయితే కొంతమంది అగ్ర హీరోలు పారితోషికాలు తీసుకోవడం తగ్గించారు. తాము కూడా నిర్మాణంలో పాలు పంచుకొంటున్నారు. ఈ విధానం పూర్తి స్థాయిలో అమలు అవ్వాలి. తమిళనాట ఈ విధానం సక్సెస్ అయితే తెలుగులో కూడా నిర్మాతలు ఈ దిశగా ఆలోచించి, హీరోలపై టెక్నీషియన్లపై ఒత్తిడి తీసుకొచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
