వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి జగన్, షర్మిల తల్లి వైఎస్ విజయలక్ష్మి పుట్టినరోజు నేడు. ఉదయమే కూతురు షర్మిల అత్యంత భావోద్వేగంగా ట్వీట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కానీ, సొంత కుమారుడు జగన్ మోహన్ రెడ్డి మాత్రం అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. విచిత్రం ఏమిటంటే.. మధ్యాహ్నం సమయంలో పవన్ కల్యాణ్ ఆపరేషన్ చేయించుకున్నారని తెలియగానే ఆయన కోలుకోవాలంటూ ట్వీట్ చేసిన జగన్, అదే చేత్తో కన్నతల్లికి ఒక హ్యాపీ బర్త్‌డే చెప్పడానికి మాత్రం మనసు రాలేదు. రాజకీయ ప్రత్యర్థి ఆరోగ్యంపై ఉన్న శ్రద్ధ, కన్నతల్లి పుట్టినరోజుపై లేకపోవడం జగన్ మార్క్ ఈగో కు అద్దం పడుతోందని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
మధ్యాహ్నం సమయంలో నారా లోకేష్ కూడా విజయమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేయడంతో కథ అడ్డం తిరిగింది. ప్రత్యర్థి పార్టీ నేత కూడా మర్యాదపూర్వకంగా విష్ చేస్తే, కన్న కొడుకై ఉండి జగన్ మౌనంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. లోకేష్ చెప్పినందుకైనా.. కుమారుడినైన నేను చెప్పకపోతే పరువు పోతుంది అనే ఆలోచనతో జగన్ సాయంత్రానికైనా విష్ చేస్తారేమోనని వైసీపీ వర్గాలు ఆశగా ఎదురుచూస్తున్నాయి. ఒకవేళ చెబితే అందరూ చెప్పారు కాబట్టి తప్పక చెప్పారు అంటారు.. చెప్పకపోతే తల్లిపై అంత కసి పెంచుకున్నారా అని ఆశ్చర్యపోతారు. ఏది చేసినా జగన్‌కు ఇప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితే.
నిజానికి ఫోన్ చేసి విష్ చేసేంత సాన్నిహిత్యం జగన్, విజయమ్మ మధ్య లేదనేది బహిరంగ రహస్యం. ఆస్తుల గొడవలో తల్లిని కూడా కోర్టుకు లాగినప్పుడే ఆ బంధంలో బీటలు వారాయి. కనీసం సోషల్ మీడియాలోనైనా ఎలాంటి ఈగోలు పెట్టుకోకుండా ఉదయమే విష్ చేసి ఉంటే ఒక కొడుకుగా ఆయన గౌరవం పెరిగేది. కానీ, జగన్ రెడ్డి రాజకీయం అంతా నేను.. నా పంతం అన్నట్లుగానే సాగుతుంది కాబట్టి, తల్లి పుట్టినరోజు కంటే తన రాజకీయ వైరాగ్యమే ఆయనకు పెద్దదిగా కనిపిస్తోంది.
వైఎస్సార్ ఉన్నప్పుడు వెలుగు వెలిగిన ఆ కుటుంబంలో, ఇప్పుడు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పుకోవడానికి కూడా రాజకీయ లెక్కలు వేసుకోవాల్సి రావడం విచారకరం. లోకేష్ లాంటి వారు విష్ చేసి జగన్ రెడ్డిని డిఫెన్స్‌లో పడేశారు. మరి సాయంత్రం లోపు జగన్ నుంచి ఏమైనా సందేశం వస్తుందో లేక నా తల్లి.. నా ఇష్టం అన్నట్లుగా మౌనాన్ని కొనసాగిస్తారో చూడాలి. ఏదేమైనా, ఒక తల్లికి పుట్టినరోజున కుమారుడి నుంచి దక్కాల్సిన కనీస గౌరవం కూడా దక్కకపోవడం వైఎస్ కుటుంబ అభిమానులను సైతం కలచివేస్తోంది.
