ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబో గురించి చిత్రసీమ ఆసక్తిగా ఎదురు చూస్తోంది. వీరిద్దరి కాంబోలో ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమా వచ్చింది. మాస్ కి బాగా నచ్చిన సినిమా ఇది. ఈసారి మైథాలజీ సబ్జెక్ట్ తో వీరిద్దరూ మ్యాజిక్ చేయబోతున్నారు. ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్ట్ ని ఎన్టీఆర్ తో తెరకెక్కిస్తారని ఇది వరకటి నుంచీ గట్టిగా ప్రచారం జరుగుతోంది. అల్లు అర్జున్, ఎన్టీఆర్ మధ్య ఈ ప్రాజెక్ట్ ఊగిసలాడింది. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ ఖరారైనట్టు ప్రచారం జోరుగా సాగుతోంది. మే 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఓ అధికారిక ప్రకటన కూడా వస్తుందని టాక్. డిసెంబరులో చిత్రీకరణ మొదలెడతారని తెలుస్తోంది.
త్రివిక్రమ్ ప్రస్తుతం వెంకటేష్ తో ఓ సినిమా చేస్తున్నారు. ఎన్టీఆర్ ‘డ్రాగన్’తో బిజీగా ఉన్నారు. ‘డ్రాగన్’ పూర్తయ్యాకే… త్రివిక్రమ్ సినిమా పట్టాలెక్కుతుంది. ఈ మైథాలజీకి ‘షణ్ముఖుడు’ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ టైటిల్ ని సితార నాగవంశీ రిజిస్టర్ చేయించినట్టు సమాచారం. ఎప్పుడైతే ఈ టైటిల్ బయటకు వచ్చిందో, అప్పుడు.. ఈ కాంబోపై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి.
మరోవైపు ‘దేవర 2’ కోసం కొరటాల శివ స్క్రిప్టు రెడీ చేసినట్టు తెలుస్తోంది. ఒకవేళ త్రివిక్రమ్ సినిమా డిసెంబరులో షూటింగ్ అనుకొంటే మాత్రం – కొరటాల వెయిట్ చేయక తప్పదు. ప్రీ ప్రొడక్షన్ కి త్రివిక్రమ్ సమయం తీసుకొంటే, ఆ గ్యాప్ లో కొరటాల `దేవర 2` పూర్తి చేయొచ్చు. ‘దేవర 2’ ఉందా, లేదా అనే విషయం కూడా మేలో తేలిపోతుంది. ‘డ్రాగన్’ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ కూడా ఎన్టీఆర్ పుట్టిన రోజున బయటకు వచ్చే అవకాశం ఉంది.
