దేశరాజకీయాల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లు అంశం మరోసారి రాజకీయసునామీకి కారణం అవుతోంది. ఈసారి కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్ల అమలును నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియతో ముడిపెట్టడం వివాదానికి దారితీస్తోంది. మహిళా బిల్లును స్వాగతిస్తున్న కాంగ్రెస్ పార్టీ, పునర్విభజన బిల్లును మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పునర్విభజన వల్ల జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు లోక్సభ స్థానాల సంఖ్య తగ్గి అన్యాయం జరుగుతుందనే ఆందోళన ప్రతిపక్షాల్లో వ్యక్తమవుతోంది.
రాజ్యాంగసవరణకు మూడింట రెండు వంతుల మద్దతు తప్పనిసరి
ఈ రెండు అంశాలు రాజ్యాంగ సవరణతో కూడుకున్నవి కావడంతో పార్లమెంటులో వీటి ఆమోదంపై ఉత్కంఠ నెలకొంది. రాజ్యాంగ సవరణ బిల్లులు చట్టబద్ధం కావాలంటే ఉభయ సభల్లోనూ మూడింట రెండు వంతుల మెజార్టీ తప్పనిసరి. ఓటింగ్లో పాల్గొన్న వారిలో కనీసం మూడింట రెండు వంతుల మంది మద్దతు తెలపాలి. ప్రస్తుత గణాంకాలను పరిశీలిస్తే లోక్సభలో ఎన్డీయే కూటమికి 293 మంది సభ్యులు ఉండగా, ఇండియా కూటమికి 234 మంది బలం ఉంది. మహిళా బిల్లుకు ప్రతిపక్షాలు మద్దతు ఇస్తే అది సులువుగా గట్టెక్కుతుంది. కానీ అందులో భాగంగానే ఉన్న పునర్విభజన బిల్లును కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తే మాత్రం ప్రభుత్వానికి చుక్కెదురు కాక తప్పదు.
ఉభయసభల్లోనూ ఆ స్థాయిలో బలం లేని ఎన్డీఏ
లోక్సభలో రాజ్యాంగ సవరణ నెగ్గాలంటే కనీసం 360 మంది సభ్యుల మద్దతు అవసరం. ప్రస్తుత ఎన్డీయే బలం ఆ మార్కు కంటే చాలా తక్కువగా ఉంది. అటు రాజ్యసభలోనూ ఎన్డీయేకు స్పష్టమైన మూడింట రెండు వంతుల మెజార్టీ లేదు. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే వంటి పార్టీలు కలిసి సుమారు 152 మంది ఎంపీలతో గట్టి వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సహా ఇతర మిత్రపక్షాల మద్దతు లేకుండా పునర్విభజన బిల్లును పాస్ చేయడం కేంద్రానికి దాదాపు అసాధ్యమని అంచనా వేస్తున్నారు.
సగం రాష్ట్రాల అసెంబ్లీలూ ఆమోదించాలి..ఇది సులువే!
మరోవైపు ఈ బిల్లుల ఆమోదానికి రాష్ట్రాల ఆమోదం కూడా కీలకం కానుంది. ఫెడరల్ వ్యవస్థకు సంబంధించిన మార్పులు కాబట్టి కనీసం సగం రాష్ట్రాల అసెంబ్లీలు వీటిని ఆమోదించాల్సి ఉంటుంది. అత్యధిక రాష్ట్రాలు ఎన్డీఏ చేతిలోనే ఉన్నందున ఆమోదం పెద్ద విషయం కాదు. మహిళా రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్న ప్రతిపక్షాలు, పునర్విభజన ముసుగులో రాజకీయ లబ్ధి పొందాలని కేంద్రం చూస్తోందని ఆరోపిస్తున్నాయి. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ఈ బిల్లులపై జరిగే ఓటింగ్ దేశ రాజకీయ దిశను మార్చనుంది.
