సోనియానే ఎదిరించిన యోధుడు మా జగనన్న అని ఎలివేషన్లు ఇచ్చుకుంటారు వైసీపీ కార్యకర్తలు. కానీ ఎప్పుడూ మోదీని ఎదిరించిన మగాడు అని మాత్రం అనడం లేదు. ఇప్పుడు అలా చెప్పుకునే అవకాశం వచ్చింది. కానీ జగన్ అవకాశాన్ని అంది పుచ్చుకుని తిరగబడితేనే. ఏపీ రాజకీయాల్లో మళ్లీ రెబల్ గా మారడానికి .. జాతీయ స్థాయిలో తన ముద్ర వేయడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి నియోజకవర్గాల పునర్విభజన వివాదం క అద్భుతమైన రాజకీయ అస్త్రంగా మారబోతోంది.
బిల్లును వ్యతిరేకిస్తే పోరాటయోధుడు అనే ఇమేజ్
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ పుంజుకోవాలని చూస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కేంద్రం ప్రతిపాదించిన నియోజకవర్గాల పునర్విభజన బిల్లు ఒక లైఫ్ లైన్ గా మారే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు నాయుడు, కేంద్రం తెచ్చే ప్రతి బిల్లుకు మద్దతు ఇవ్వాల్సిన రాజకీయ అనివార్యతలో ఉన్నారు. సరిగ్గా ఇదే జగన్‌కు కలిసి వచ్చే అంశం. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసేలా ఉన్న ఈ బిల్లును జగన్ గనుక గట్టిగా వ్యతిరేకిస్తే, ఆయన మళ్లీ ప్రజల్లో కోల్పోయిన పోరాట యోధుడు అనే ఇమేజ్ను తిరిగి పొందే అవకాశం ఉంది.
స్టాలిన్‌తో దోస్తీ.. జాతీయ స్థాయిలో గుర్తింపు
తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఇప్పటికే డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా గళమెత్తారు. జగన్ గనుక స్టాలిన్ వంటి నేతలతో కలిసి దక్షిణాది హక్కుల కోసం గళం విప్పితే, అది కేవలం ఏపీకే పరిమితం కాకుండా దేశవ్యాప్త చర్చకు దారితీస్తుంది. బీజేపీతో రాజీ పడుతున్నారనే ముద్రను చెరిపేసుకోవచ్చు. తద్వారా తనను తాను రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షకుడిగా చిత్రించుకోవడానికి జగన్‌కు ఇంతకంటే మంచి సమయం రాదు. మహిళా బిల్లుకు మద్దతు ఇస్తూ చంద్రబాబు లేఖ రాయడం ద్వారా జగన్‌ను ఇరుకున పెట్టాలని చూసినా, డీలిమిటేషన్ అంశం దానికి భిన్నమైనది. జనాభా ప్రాతిపదికన ఏపీకి లోక్‌సభ సీట్లు తగ్గితే లేదా ఉత్తరాదితో పోలిస్తే ప్రాధాన్యత తగ్గితే, దానికి చంద్రబాబు మద్దతు ఇస్తున్నారనే ఆరోపణను జగన్ వాడుకోవచ్చు. ఒకవేళ జగన్ ఈ బిల్లును వ్యతిరేకించి, పోరాటం మొదలుపెడితే.. చంద్రబాబు అటు కేంద్రానికి, ఇటు రాష్ట్ర ప్రయోజనాలకు మధ్య నలిగిపోయే ప్రమాదం ఉంది.
పోరాటాలతోనే రాజకీయ విజయాలు
గతంలో ప్రత్యేక హోదా కోసం జగన్ చేసిన సుదీర్ఘ పోరాటమే ఆయన్ను 2019లో అధికారంలోకి తెచ్చింది. ఇప్పుడు మళ్లీ అలాంటిదే ఒక బలమైన సెంటిమెంట్ అంశం డీలిమిటేషన్ రూపంలో దొరికింది. ఇది కేవలం రాజకీయ సీట్ల సంఖ్య మాత్రమే కాదు, దక్షిణాది ఆత్మగౌరవ సమస్య అని ప్రజల్లోకి తీసుకెళ్లగలిగితే, వైఎస్సార్సీపీకి మళ్లీ పూర్వ వైభవం రావడం అసాధ్యమేమీ కాదు. ఢిల్లీ పీఠం వద్ద తలవంచని నేతగా తన ముద్రను పునరుద్ధరించుకోవడానికి జగన్ తెగించాల్సిన సమయం ఆసన్నమైంది.
రాజకీయాల్లో టైమింగ్ చాలా ముఖ్యం. ఇప్పుడు దేశవ్యాప్తంగా డీలిమిటేషన్ సెగ మొదలవుతున్న వేళ, జగన్ గనుక ముందడుగు వేసి బిల్లును వ్యతిరేకిస్తే, ఆయన మళ్లీ మెయిన్ స్ట్రీమ్ రాజకీయాల్లో కీలకంగామారే అవకాశం ఉంది. అవకాశం చేజార్చుకుంటే ఎప్పటికీ బీజేపీ దగ్గరకు తీయని సామంత నేతగా ఉంటారు. అది ఆయన రాజకీయ పతనంలో కీలక పాత్ర పోషిస్తుంది.
