నాని కెరీర్ జెట్ స్పీడులో దూసుకుపోతోంది. ఓ వైపు హీరోగా క్రేజీ ప్రాజెక్టులు సెట్ చేసుకొంటున్నాడు. నిర్మాతగా కూడా తనది గోల్డెన్ హ్యాండ్ అయిపోయింది. వాల్ పోస్టర్ బ్యానర్లో వచ్చిన ప్రతీ సినిమా నానికి లాభాలతో పాటుగా గౌరవాన్ని తెచ్చి పెడుతోంది. తాజాగా విడుదలైన ‘కోర్ట్’ నానిని అన్ని విధాలా సంతృప్తి పరిచింది. ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు రామ్ జగదీష్. ఇప్పుడు వాల్ పోస్టర్ బ్యానర్లోనే మరో సినిమా చేయబోతున్నాడని టాక్. ఈసారి ఓ అగ్ర హీరోకి కథ చెప్పే ప్రయత్నంలో ఉన్నారు జగదీష్.
కథానాయకుడిగా దుల్కర్ సల్మాన్ పేరు గట్టిగా వినిపిస్తోంది. నాని బ్యానర్లో దుల్కర్ సినిమా చేస్తే కచ్చితంగా మార్కెట్ లో మంచి క్రేజ్ ఏర్పడుతుంది. దుల్కర్ అవునన్నా, కాదన్నా.. ఓ స్టార్ హీరో నటించడం మాత్రం ఖాయం. నాని అనుకొంటే, ఎలాంటి స్టార్ హీరోనైనా ఈ ప్రాజెక్ట్ లోకి తీసుకురాగలడు. ప్రస్తుతం కథా చర్చలు నడుస్తున్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పై ఓ క్లారిటీ రాబోతోంది. మరోవైపు నాని నిర్మాతగా చిరంజీవి కథానాయకుడిగా ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకుడు. ‘పారడైజ్’ షూటింగ్ పూర్తవగానే చిరు సినిమా సెట్స్ పైకి వెళ్తుంది. ఈలోగా చిరంజీవి – అనిల్ రావిపూడి సినిమా పూర్తవ్వాల్సివుంది.