రాజకీయాల్లో నేతల మాటలకు అర్థాలు వేరుగా ఉంటాయో.. లేదో కానీ నేరుగా మాట్లాడిన మాటలకు రాజకీయ నేతలు ఎవరి అర్థాలు వారు తీసుకుంటారు. ఈ విషయాన్ని బీజేపీ నేతలు మరోసారి నిరూపించారు. కేసీఆర్ మాటే తన బాట అని హరీష్ రావు మంగళవారం ప్రకటించారు. పార్టీ మారడమో.. కొత్త పార్టీ పెడతారనో ప్రచారం జరుగుతున్న సమయంలో హరీష్ రావు ఈ వివరణ ఇచ్చారు. ఇలాంటి ప్రచారాలు ఇప్పుడు కాదు.. ఎప్పట్నుంచో జరుగుతున్నాయి. హరీష్ రావు కూడా అదే చెబుతున్నారు ఇందులో కొత్తేం లేదు కానీ.. కొత్తగా బీజేపీ నేతలకు హరీష్ రావు మాటల్లో విలీనం అనే అర్థం వినిపించింది.
బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం ముహుర్తం ఖరారు అయిందని స్టేట్ మెంట్ ఇచ్చారు. దానికి ఆధారం ఏమిటంటే హరీష్ రావు మాట్లాడిన మాటలట. కేసీఆర్ బాటలోనే నడుస్తానని హరీష్ రావు చెప్పడమే దానికి నిదర్శనమన్నారు జూన్ రెండో తేదీన లేదా డిసెంబర్ లో విలీనం ఉంటుందని తర్వాత కేసీఆర్ సీఎంగా ప్రమాణం చేస్తారన్నారు. రేవంత్ రెడ్డి మార్పు ఖాయమని చెప్పుకొచ్చారు. అందుకే హరీష్ రావు కేసీఆర్ వెంటనే నడుస్తానని చెబుతున్నాని చెప్పుకొచ్చారు.
బీజేపీ నేతల మాటల్లో ఇసుమంత కూడా లాజిక్ లేదు. అయినా ఇదేదో పెద్ద సీక్రెట్ అన్నట్లుగా ప్రెస్మీట్ పెట్టి చెప్పేశారు. కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ విలీనం చేసే దానికి అయితే.. ఇటీవల భారీగా ఖర్చు పెట్టుకుని రజతోత్సవ వేడుకలు నిర్వహించాల్సిన అవసరం ఉండేది. ఇప్పటికిప్పుడు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ ఉందని కూడా అనుకోలేరు. ఇలాంటి సమయంలో పార్టీని విలీనం చేస్తారని బీజేపీ నేతలు మాత్రమే అనుకుంటారు. అనుకోవడమే కాదు.. గొప్ప సీక్రెట్ కనిపెట్టామని మీడియా ముందుకు వచ్చి చెబుతూంటారు కూడా.