వైసీపీ నేతలు స్వయంకృతాపరాధం రాజకీయంలో గెలుపోటములు సహజం. కానీ, ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోకపోవడం మూర్ఖత్వం. ప్రస్తుతం వైకాపా నేతల పరిస్థితి చూస్తుంటే.. వారు ఒక విషవలయంలో చిక్కుకున్నట్లు కనిపిస్తోంది. ఐదేళ్ల పాలనలో ఎంత దారుణంగా తిడితే అంత పెద్ద పదవి అనే సంప్రదాయాన్ని జగన్ రెడ్డి ప్రోత్సహించారు. జోగి రమేష్ వంటి వారికి మంత్రి పదవులు దక్కడం దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. అయితే, ఇప్పుడు అధికారం లేకపోయినా అదే బాటలో నడవడం ఆ నేతల రాజకీయ సమాధికే దారితీసేలా ఉంది.
నేతల్ని బలిపశువులుగా వాడుకుంటున్న సజ్జల, జగన్
అధికారంలో ఉన్నప్పుడు స్క్రిప్టులు పంపించి మరీ నేతలతో తిట్టించారు. అధికారం మనది కాబట్టిఎవరూ ఏమీ చేయలేరని.. ప్రోత్సాహాకాలు ఉంటాయని ఆశపెట్టారు. అధికారం పోయాక కూడా అదే వ్యూహాన్ని పాటిస్తున్నారు. వైసీపీ కార్యాలయం నుంచి వచ్చే బూతుల్ని కొంతమంది చదివేస్తున్నారు. ఒకే రోజు అంబటి రాంబాబు, జోగి రమేష్ , అప్పలరాజు సహా చాలా మంది వైసీపీ నేతలు బూతులతో విరుచుకుపడ్డారు. ఇదంతా యాదృఛ్చితంగా జరిగేది కాదు. వీరందరికీ తెలుసు. పెద్ద కుట్ర అని. మరి ఎందుకు ఇలా చేస్తున్నారు. ? బలి అయ్యేది వారు. సానుభూతి రాజకీయాలు చేసేది జగన్. ఇంత చిన్నలాజిక్ మిస్సవుతున్న నేతలు ప్రజల్లో ఇప్పటి వరకూ తెచ్చుకున్న ఇమేజ్ ను నాశనం చేసుకుంటున్నారు.
అంబటి రాంబాబుకు ఎదురైన పరాభవం ఒక హెచ్చరిక
అంబటి రాంబాబుకు ప్రజల మధ్య ఎదురైన చేదు అనుభవం కేవలం ఒక వ్యక్తికి సంబంధించింది కాదు. అది మారుతున్న ప్రజా నాడికి నిదర్శనం. ప్రజలు గత ఐదేళ్ల భాషను, ప్రవర్తనను మర్చిపోలేదని వైసీపీ నేతలు గ్రహించాల్సి ఉంది. అధికారం ఉన్నప్పుడు రక్షించే వ్యవస్థలు ఉంటాయి, కానీ అధికారం పోయాక ప్రజలే న్యాయ నిర్ణేతలు. ఈ చిన్న లాజిక్ మిస్సవుతున్న నేతలు బలిపశువులు కావడానికి సిద్ధపడుతున్నారు. జగన్ రెడ్డి రాజకీయ శైలి ఎప్పుడూ ఒకేలా ఉంటుంది: ఘర్షణ వాతావరణాన్ని సృష్టించడం. దీనివల్ల తన మీద వచ్చే వ్యతిరేకతను పక్కకు మళ్లించి, నేతలను బలి చేయడం ఆయనకు అలవాటు. వైసీపీ నేతలకు ఈ విషయం తెలిసి కూడా ఇరుక్కుపోతున్నారు.
అలాంటి రాజకీయాల్ని ప్రజలు అంగీకరించరు !
రాజకీయాల్లో మనుగడ సాగించాలంటే ప్రజల నాడి పట్టుకోవాలి కానీ, తాడేపల్లి ప్యాలెస్ మెప్పు కోసం చూడకూడదు. ఇప్పటికైనా వైకాపా నేతలు వాస్తవాలను గ్రహించకపోతే, రాబోయే రోజుల్లో వారు రాజకీయంగా కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. బూతులతో బతుకుదెరువు వెతుక్కునే ప్రయత్నం చేస్తే, ప్రజలు వారిని శాశ్వతంగా పక్కన పెట్టేస్తారు. ఆ విషయం ఇప్పటికే నిరూపితమయింది. అయినా ఈ నేతలకు తెలియడం లేదు. తెలుసుకున్న చాలా మంది సైలెంటుగా ఉన్నారు.
