మైత్రీ మూవీస్ పాన్ ఇండియా బ్యానర్ అయిపోయింది. బాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తోంది. దేశంలోని అగ్ర కథానాయకులందరితోనూ సినిమాలు చేయాలన్న లక్ష్యంతో పని చేస్తోంది. ఇప్పుడు రజనీకాంత్ తోనూ ఓ ప్రాజెక్ట్ సెట్ చేసే పనిలో మైత్రీ మూవీస్ నిమగ్నమై ఉందని టాక్. ఈ మేరకు రజనీకాంత్ తో సంప్రదింపులు కూడా మొదలయ్యాయని తెలుస్తోంది. తెలుగులో డీసెంట్ సినిమాలు తీసిన ఓ యంగ్ డైరెక్టర్ కి ఈ సినిమా బాధ్యతలు అప్పగించబోతున్నారని ఇన్ సైడ్ వర్గాల టాక్. ఆ దర్శకుడు ఎవరో కాదు.. వివేక్ ఆత్రేయ.
మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా, అంటే సుందరానికి, సరిపోదా శనివారం.. ఇలా మంచి మంచి సినిమాలతో తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు వివేక్ ఆత్రేయ. ‘సరిపోదా శనివారం’ తనకు కమర్షియల్ గానూ మంచి విజయాన్ని అందించింది. ఇప్పుడు సూపర్ స్టార్ కోసం ఓ కథ రాస్తున్నాడట. అది మైత్రీ మూవీస్ బ్యానర్లో రూపొందించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్ డిస్కర్షన్ స్థాయిలోనే ఉంది. మైత్రీ – రజనీకాంత్ తో ఓ సినిమా చేయడం దాదాపుగా ఖాయం. దర్శకుడిగా ఓ ఆప్షన్ వివేక్ ఆత్రేయ. ఇంకా చర్చల దశలో ఉంది కాబట్టి మున్ముందు వేరే దర్శకుడు, ఇంకా మంచి కథతో వస్తే, అప్పుడు సమీకరణాలు మారతాయి. రజనీకాంత్ కూడా మైత్రీ తో సినిమా చేయడానికి ఉత్సాహంగానే ఉన్నార్ట. త్వరలోనే ఓ క్లారిటీ వస్తుంది.