అనిల్ రావిపూడి అసాధ్యుడే. ఎందుకంటే నయనతారని ఓ సినిమా కోసం ఒప్పించడం ఒక ఎత్తయితే, ఆమెను ప్రమోషన్లలో దించడం మరో ఎత్తు. సినిమాకు కోట్లకు కోట్లు పారితోషికం అందుకొనే నయన.. ప్రమోషన్ల విషయానికి వచ్చే సరికి చేతులు ఎత్తేస్తుంది. ‘ప్రమోషన్లు నా బాధ్యత కాదు’ అంటూ పక్కకు తప్పుకొంటుంది. అలాంటి నయనతో ఓ ప్రమోషనల్ వీడియో చేసేశాడు. దాన్ని రిలీజ్ చేశాడు కూడా.
చిరంజీవి – అనిల్ రావిపూడి కాంబోలో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. నయతార కథానాయిక. ఇటీవలే నయనకు కథ చెప్పడానికి అనిల్ రావిపూడి చెన్నై వెళ్లారు. అక్కడ నయనకు కథ చెప్పడమే కాదు, వస్తూ, వస్తూ ఓ వీడియో కూడా చేయించుకొని వచ్చేశారు. నయన ఆన్ బోర్డ్ అని చెప్పడానికి నయనతో చిన్న స్కిట్ కూడా చేయించాడు. ‘హలో మాస్టారూ కెమెరా కొద్దిగా రైట్ టర్నింగ్ ఇచ్చుకోమ్మా’, ‘సంక్రాంతికి రఫ్ఫాడించేద్దాం’ అనే డైలాగులు నయన నోటి నుంచి పలికించాడు.
ఈనెల 22 నుంచి హైదరాబాద్ లో షూటింగ్ మొదలు కానుంది. ఈ సినిమా కోసం అన్నపూర్ణ స్టూడియోలో ఓ భారీ సెట్ వేశారు. అక్కడ పది రోజుల పాటు కీలకమైన సన్నివేశాలు తెరకెక్కిస్తారు. కేథరిన్ మరో కథానాయికగా నటిస్తోంది. భీమ్స్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే మూడు పాటలు రికార్డ్ చేసినట్టు టాక్. ఓ పాట చిరంజీవి పాడనున్నార్ట.