కరీంనగర్లో మజ్లిస్ వర్సెస్ కాంగ్రెస్ రాజకీయాన్ని రక్తి కట్టించేందుకు రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నట్లుగా ఉన్నాయి. బండి సంజయ్ మజ్లిస్ ను బూచిగా చూపి కరీంనగర్లో హిందూ ఓటర్లను పోలరైజ్ చేసేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. మజ్లిస్‌కు కరీంనగర్ మేయర్ సీటిస్తారని అంటున్నారు. ఈ ప్రచారాన్ని తిప్పికొట్టకపోతే మొదటికే మోసం వస్తుందని అనుకున్నాయేమో కానీ.. కాంగ్రెస్, మజ్లిస్ పోటాపోటీగా విమర్శలు ప్రారంభించుకున్నాయి.
కరీంనగర్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ మేము ముఖ్యమంత్రుల దగ్గరకు వెళ్లము.. ముఖ్యమంత్రులే మా దగ్గరకు వస్తారు అని వ్యాఖ్యానించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఎంఐఎం మద్దతు లేనిదే కాంగ్రెస్ గెలవలేదని, అధికారంలో రెడ్డి ఉన్నా, రావు ఉన్నా తమ వద్దకు రావాల్సిందేనని ఆయన తేల్చేశారు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం సత్తా ఏంటో చూపిస్తామని అక్బరుద్దీన్ సవాల్ విసిరారు.
అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్ బాబు గట్టిగా స్పందించారు. తామే గెలిపించామని ఎంఐఎం నేతలు అనుకోవడం పెద్ద పొరపాటని ఆయన కొట్టిపారేశారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన సొంత బలంపై, ఒంటరిగానే విజయం సాధించిందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు రాత్రింబవళ్లు కష్టపడితేనే గెలుపు సాధ్యమైందని, ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలన చూసి ప్రజలు ఓట్లు వేశారే తప్ప ఎవరో మద్దతు ఇస్తే గెలవలేదని ఆయన కౌంటర్ ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీం అని, ఎవరూ తామే కింగ్ మేకర్లమని భ్రమపడకూడదని హితవు పలికారు.
ఉత్తర తెలంగాణలో ముస్లింలు ఎక్కువగా ఉన్న చోట బీజేపీ, మజ్లిస్ పోరులో కాంగ్రెస్ వెనుకబడిపోతోంది. ఈ క్రమంలో మజ్లిస్ కు తాము స్నేహితులం కాదని చెప్పడం ద్వారా కాంగ్రెస్.. అందరూ బీజేపీ వైపు పోలరైజ్ కాకుండా ప్రయత్నిస్తోంది.
