మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పునర్విభజన బిల్లులను కేంద్రం పార్లమెంట్ లో ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా జరిగిన చర్చలో బీజేపీ యువ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన ప్రసంగం వైరల్ గా మారింది. ఆయన రేవంత్ ప్రతిపాదించిన హైబ్రీడ్ మోడల్ లోపాలను చీల్చిచెండాడమే కాకుండా.. కాంగ్రెస్ చేసిన రాష్ట్ర విభజనపైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ విభజన అంశాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. గతంలో బ్రిటిష్ వారు దేశాన్ని విభజించిన తీరు కంటే దారుణంగా, అశాస్త్రీయంగా ఏపీని ముక్కలు చేశారని మండిపడ్డారు. తెలుగు ప్రజల సెంటిమెంట్లను కాలరాసి, ఆర్థిక వనరులపై కనీస స్పష్టత లేకుండా కాంగ్రెస్ చేసిన ఆ చారిత్రక తప్పిదం వల్లే నేటికీ ఏపీ ప్రజలు కోలుకోలేని గాయాలతో సతమతమవుతున్నారని విరుచుకుపడ్డారు.
జీడీపీ ఆధారంగా సీట్ల కేటాయింపు ఉండాలన్న రేవంత్ ప్రతిపాదనను అత్యంత తెలివితక్కువదిగా అభివర్ణించారు. ఏటా మారే ఆర్థిక గణాంకాల ఆధారంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో సీట్లు కేటాయించడం అసాధ్యమని స్పష్టం చేశారు. ఆదాయమే ప్రాతిపదిక అయితే, దేశంలో అత్యధిక పన్నులు కట్టే అంబానీకి లక్ష ఓట్లు ఉండాలని, సామాన్యుడికి ఒక్క ఓటే ఉండాలని రేవంత్ కోరుకుంటున్నారా అని ప్రశ్నించారు. రాజ్యాంగం కల్పించిన ఒక వ్యక్తి – ఒక ఓటు అనే ప్రాథమిక సూత్రాన్ని తక్కువ చేసే ఏ ప్రయత్నమైనా అజ్ఞానమే అవుతుందని సూర్య హెచ్చరించారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందంటూ రేవంత్ రెడ్డి వంటి వారు చేస్తున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని కోరారు. శాస్త్రీయ పద్ధతిలో, అందరికీ న్యాయం జరిగేలా కేంద్రం పునర్విభజన చేపడుతుందని భరోసా ఇచ్చారు.
పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగబోదని స్పష్టం చేశారు. ప్రోరాటా ప్రకారం 23.9 శాతం సీట్లు దక్షిణాదికి ఉంటాయని తేజస్వీ స్పష్టం చేశారు. దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని ప్రచారం చేస్తూ అందర్నీ తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచి వాగ్దాటి కలిగిన తేజస్వీసూర్య ప్రసంగం వైరల్గా మారింది.
