ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా మాజీ సీఎస్ అనిల్‌చంద్ర పునేఠా నియామకానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పచ్చజెండా ఊపారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ దృష్ట్యా ఈ నియామకం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. పునేఠా నియామకంతో పాటు, ప్రస్తుతం ఆ స్థానంలో ఉన్న నీరభ్ కుమార్‌ను విజిలెన్స్ కమిషనర్‌గా బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గవర్నర్ ఆమోద ముద్ర పడటమే ఆలస్యం, అధికారికంగా ఈ ఉత్తర్వులు వెలువడనున్నాయి.
2019 ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన అనిల్‌చంద్ర పునేఠాకు పరిపాలనలో సుదీర్ఘ అనుభవం ఉంది. గతంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల అమలులో ఆయన ఎదుర్కొన్న సవాళ్లు, ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు మళ్లీ ఎన్నికల కమిషనర్‌గా ఆయన బాధ్యతలు చేపట్టడం ఆసక్తికరంగా మారింది. రానున్న పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించడమే లక్ష్యంగా ప్రభుత్వం పునేఠా అనుభవాన్ని వినియోగించుకోవాలని భావిస్తోంది.
స్థానిక సంస్థల ఎన్నికలు పునేఠా నేతృత్వంలోనే సాగనున్నాయి. గతంలో స్థానిక ఎన్నికల నిర్వహణపై అనేక వివాదాలు తలెత్తాయి. వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టడం పునేఠా ముందున్న ప్రధాన సవాలు. నిబంధనల అమలులో కఠినంగా వ్యవహరించే అధికారిగా గుర్తింపు ఉన్న ఆయన ఆధ్వర్యంలో స్థానిక సమరం సజావుగా సాగుతుందన్న నమ్మకం రాజకీయవర్గాల్లో ఏర్పడింది.
