నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ వల్ల జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ , తమిళనాడులకు సీట్ల సంఖ్య తగ్గుతుందనే ప్రచారాన్ని ప్రధాని మోదీ తీవ్రంగా ఖండించారు. ఏ ఒక్క రాష్ట్రానికీ అన్యాయం జరగనివ్వబోం. జనాభా నియంత్రణ పాటించినందుకు రాష్ట్రాలను శిక్షించే ప్రసక్తే లేదు అని ఆయన లోక్ సభలో స్పష్టం చేశారు. పునర్విభజన ప్రక్రియలో శాస్త్రీయతను పాటిస్తూనే, అన్ని ప్రాంతాల రాజకీయ ప్రాతినిధ్యాన్ని కాపాడేలా చట్టబద్ధమైన గ్యారెంటీ ఇస్తామని హామీ ఇచ్చారు.
చిన్న రాష్ట్రాలు, దక్షిణాదికి అన్యాయం అంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలకు సమాధానమిస్తూ.. ఈ బిల్లులు ఏ ఒక్క వర్గానికో లేదా ప్రాంతానికో వ్యతిరేకం కాదని, దేశం మొత్తాన్ని ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ దిశగా నడిపిస్తాయని చెప్పారు. అభివృద్ధి చెందిన రాష్ట్రాలను గౌరవిస్తూనే, వెనుకబడిన ప్రాంతాలను ముందుకు తీసుకురావడమే తమ ప్రాధాన్యత అని పేర్కొన్నారు. పార్లమెంటులో జరుగుతున్న ఈ చర్చలు కేవలం రాజకీయాల కోసం కాదని, రాబోయే తరాల భవిష్యత్తును నిర్ణయించే పునాదులని ప్రధాని మోదీ తన ప్రసంగంలో స్పష్టం చేశారు. కొంత మంది విభజన రాజకీయాలు చేస్తున్నారని అలాంటి రాజకీయాలకు కాలం చెల్లిందన్నారు.
మహిళా రిజర్వేషన్ బిల్లును 2029 నాటికి పూర్తిస్థాయిలో అమలు చేయాలనే దృఢ సంకల్పంతో ప్రభుత్వం ఉందని మోదీ స్పష్టం చేశారు. ఇది కేవలం ఎన్నికల నినాదం కాదని, దేశాభివృద్ధిలో మహిళల భాగస్వామ్యాన్ని నాన్-నెగోషియబుల్ గా మార్చడమే తమ లక్ష్యమని చెప్పారు. నారీ శక్తి వందన్ అధినియం ద్వారా చట్టసభల్లో మహిళలకు లభించే 33 శాతం రిజర్వేషన్లు భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
భారతదేశం మదర్ ఆఫ్ డెమోక్రసీ అని పేర్కొన్న ప్రధాని, వేల ఏళ్ల మన ప్రజాస్వామ్య ప్రయాణంలో కాలానికి అనుగుణంగా మార్పులు చేసుకోవడం అవసరమని చెప్పారు. గతంలో ఈ రిజర్వేషన్ల విషయంలో జరిగిన ఆలస్యాన్ని ప్రస్తావిస్తూ, ఇప్పుడు ఒక పరిణతి చెందిన దశలో దీనిని ఆమోదించే అవకాశం ఈ సభకు లభించిందని అన్నారు. రాబోయే దశాబ్దాల్లో భారతదేశం మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడంలో మహిళల పాత్ర మరియు సమతుల్య ప్రాంతీయ ప్రాతినిధ్యం కీలకమని ఆయన స్పష్టం చేశారు.
