తమిళనాడు ఎన్నికల ఫలితాలు వెలువడగానే రాజకీయ విశ్లేషకులు, అభిమానులు ఒకే అడుగులో నటుడు విజయ్ను ఎంజీఆర్, ఎన్టీఆర్ వంటి యుగపురుషులతో పోల్చడం మొదలుపెట్టారు. పార్టీ స్థాపించిన అనతి కాలంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించడం విశేషమే కావచ్చు, కానీ ఈ గెలుపును ఆ దిగ్గజాల విజయాలతో పోల్చడం కేవలం తొందరపాటు మాత్రమే కాదు.. ఆ మహనీయుల రాజకీయ ప్రస్థానాన్ని తక్కువ చేయడమే అవుతుంది. ఎంజీఆర్, ఎన్టీఆర్ లు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఉన్న పరిస్థితులు వేరు, నేడు విజయ్ అడుగుపెట్టినప్పటి పరిస్థితులు వేరు.
అవకాశం ఇచ్చిన రాజకీయ శూన్యం
విజయ్ సాధించిన ఫలితం వెనుక ఆయన వ్యక్తిగత ఇమేజ్ కంటే తమిళనాడులో ఏర్పడిన రాజకీయ శూన్యత ప్రధాన పాత్ర పోషించింది. కరుణానిధి, జయలలిత వంటి మేరునగ సమానమైన నేతలు ఉన్న కాలంలో కనీసం రాజకీయాల వైపు చూడటానికి కూడా ధైర్యం చేయలేని నటులు.. నేడు ఆ ఇద్దరు దిగ్గజాలు లేని ఖాళీని చూసి రంగంలోకి దిగారు. ఎంజీఆర్ తన సొంత గ్లామర్‌తో పాటు ద్రవిడ సిద్ధాంతాన్ని పుణికిపుచ్చుకుని అన్నాడీఎంకేను నిర్మించారు. ఎన్టీఆర్ కేవలం తొమ్మిది నెలల్లోనే కాంగ్రెస్ వంటి వ్యవస్థీకృత పార్టీని మట్టికరిపించి అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చారు. కానీ విజయ్ కనీసం సొంతంగా మెజారిటీ మార్కును కూడా అందుకోలేకపోయారు.
అసంపూర్ణ తీర్పు.. అగ్నిపరీక్ష
ఎంజీఆర్, ఎన్టీఆర్ లు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కేవలం అతిపెద్ద పార్టీగా నిలవలేదు.. ప్రజల నుంచి తిరుగులేని మాండేట్ పొందారు. వారు ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ప్రభుత్వ స్థిరత్వంపై ఎటువంటి నీలినీడలు లేవు. కానీ విజయ్ పరిస్థితి భిన్నంగా ఉంది. ఆయనకు ప్రజలు సంపూర్ణ మద్దతు ఇవ్వలేదు.. కేవలం ఒక ప్రత్యామ్నాయంగా మాత్రమే చూశారు. మెజారిటీకి అవసరమైన సీట్లు కూడా సాధించలేక, ఇతరుల మద్దతు కోసం ఎదురుచూస్తున్న విజయ్ విజయాన్ని ప్రభంజనం అనడం రాజకీయ హాస్యాస్పదం. ఆ దిగ్గజాలు సునామీలా విరుచుకుపడి ప్రత్యర్థులను తుడిచిపెట్టారు, కానీ విజయ్ కేవలం ఒక అలలా వచ్చి తీరం వద్ద ఆగిపోయారు.
సిద్ధాంతం లేని రాజకీయం
విజయ్ తన రాజకీయాల్లో ఇప్పటివరకు స్పష్టమైన సిద్ధాంతాన్ని గానీ, విధానాలను గానీ ప్రజల ముందు ఉంచలేదు. కేవలం సినిమాల్లోని డైలాగులు, గ్లామర్‌పై ఆధారపడి పొలిటికల్ మైలేజ్ పొందారు. ఎంజీఆర్ పేదల సంక్షేమం కోసం మధ్యాహ్న భోజన పథకం వంటి విప్లవాత్మక మార్పులు తెస్తే, ఎన్టీఆర్ రూ. 2 కే కిలో బియ్యం వంటి పథకాలతో సామాన్యుడి గుండెల్లో నిలిచారు. విజయ్ ఇంకా పరిపాలన అంటే ఏమిటో కూడా తెలియని స్థితిలో ఉన్నారు. ఈ అసంపూర్ణ విజేతను తీసుకొచ్చి, దశాబ్దాల పాటు రాష్ట్రాన్ని ఏలిన లెజెండ్స్‌తో పోల్చడం ఆ దిగ్గజాల్ని అవమానించడమేననేది ఎక్కువ మంది అభిప్రాయం.
నిరూపించుకోవాల్సింది చాలా ఉంది!
విజయ్ ఎదుర్కొన్నది బలహీనమైన డీఎంకేను , ఉనికి కోసం పోరాడుతున్న అన్నాడీఎంకేను మాత్రమే. అదే జయలలిత లేదా కరుణానిధి బతికి ఉన్నప్పుడు విజయ్ ఈ స్థాయి ఫలితాలను సాధించగలరా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. కాబట్టి, విజయ్ను ఎంజీఆర్, ఎన్టీఆర్ అని సంబోధించే ముందు.. ఆయన కనీసం ఐదేళ్ల పాటు సుస్థిరమైన పాలన అందించి, ప్రజల మనసు గెలుచుకోవాలి. అప్పటి వరకు ఆయన కేవలం ఒక ఎన్నికలో నెగ్గిన హీరో మాత్రమే తప్ప.. చరిత్ర సృష్టించిన లెజెండ్ కాలేడు.
