తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు భారత రాజకీయాల్లో ఒక సరికొత్త డిజిటల్ విప్లవానికి నాంది పలికాయి. ఈ ఎన్నికల్లో టీవీకే సాధించిన విజయం కేవలం ఒక నటుడి గ్లామర్‌కు దక్కిన గుర్తింపు మాత్రమే కాదు. ఇది సంప్రదాయ మీడియా గుత్తాధిపత్యం ముగిసిందని చెప్పే ఒక బలమైన సంకేతం. ఎటువంటి వారసత్వ మీడియా మద్దతు లేకుండా, కేవలం డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఒక కొత్త పార్టీ అతిపెద్ద రాజకీయ శక్తిగా ఎదగడం మీడియా తరంలో వస్తున్న మార్పునకు సంకేతం.
సంప్రదాయ మీడియా – ఓటమికి సాక్షి
దశాబ్దాలుగా డీఎంకే, అన్నాడీఎంకేలకు సొంత టీవీ ఛానళ్లు, వార్తాపత్రికలు ఉన్నాయి. ఈ మీడియా నెట్వర్కులు విజయ్ను ఒక బిగినింగ్ ప్లేయర్‌గా మాత్రమే చూపించాయి. కొన్ని పూర్తిగా విస్మరించాయి. కానీ, విజయ్ ఈ లెగసీ మీడియా అడ్డంకిని డిజిటల్ మీడియా ద్వారా సునాయాసంగా అధిగమించారు. పత్రికల్లో వార్తలు రాకపోయినా, టీవీల్లో చర్చలు జరగకపోయినా.. నేరుగా ఓటరు స్మార్ట్‌ఫోన్ లోకి ఆయన సందేశం చేరిపోయింది. అంటే, రాజకీయ సమాచార వ్యాప్తిలో సంప్రదాయ మీడియా తన ప్రాముఖ్యతను కోల్పోయిందని ఈ ఫలితాలు నిరూపిస్తున్నాయి.
వార్ రూమ్ నుంచి వాట్సాప్ గ్రూపు వరకు
విజయ్ తన అభిమాన సంఘాలను కేవలం సినిమా ప్రచారం కోసం కాకుండా, ఒక క్రమశిక్షణ గల డిజిటల్ ఆర్మీ గా మార్చుకున్నారు. ప్రతి బూత్ స్థాయిలో ఒక డిజిటల్ కన్వీనర్‌ను ఏర్పాటు చేసి, డీఎంకే ప్రభుత్వ వైఫల్యాలను, విజయ్ సిద్ధాంతాలను రీల్స్, షార్ట్స్ రూపంలో ప్రజల్లోకి పంపారు. సంప్రదాయ పార్టీలు కోట్లు ఖర్చు చేసి భారీ ర్యాలీలు నిర్వహిస్తే, విజయ్ టీమ్ అతి తక్కువ ఖర్చుతో టార్గెటెడ్ క్యాంపెయినింగ్ ద్వారా యువతను, కొత్త ఓటర్లను ఆకర్షించింది. నేడు రాజకీయ యుద్ధభూమి రోడ్లపై కంటే ఎక్కువగా మొబైల్ స్క్రీన్ల పైనే జరిగిందని స్పష్టమవుతోంది.
జీరో లెగసీ ఒక వరం
విజయ్‌కు సంప్రదాయ మీడియా మద్దతు లేకపోవడం ఆయనకు ఒక రకంగా యాంటీ-ఎస్టాబ్లిష్మెంట్ ఇమేజ్ను తెచ్చిపెట్టింది. వ్యవస్థ మొత్తం ఆయనకు వ్యతిరేకంగా ఉన్నా ఆయన పోరాడుతున్నారు అనే భావన యువతలో బలపడింది. డిజిటల్ స్పేస్ అనేది అందరికీ సమాన అవకాశం అవ్వడం వల్ల, ధనబలం ఉన్న పార్టీల కంటే కంటెంట్ బలంగా ఉన్న విజయ్ లాంటి వ్యక్తులకు ఎక్కువ రీచ్ లభించింది. సోషల్ మీడియాలో సామాన్యుడు వినిపించిన గళమే చివరకు తీర్పుగా మారింది.
న్యూ ఏజ్ క్యాడర్ ఇంజనీరింగ్
విజయ్ తన క్యాడర్‌ను నిర్మించిన తీరు అద్భుతం. ఆయన కేవలం డిజిటల్ ప్రచారానికే పరిమితం కాకుండా, ఆ డిజిటల్ ఉత్సాహాన్ని క్షేత్రస్థాయి ఓట్లుగా మార్చడంలో సఫలమయ్యారు. 2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయన మద్దతుదారులు స్వతంత్రులుగా గెలిచినప్పుడే.. డిజిటల్ నెట్వర్క్ క్షేత్రస్థాయిలో ఎంత బలంగా ఉందో అర్థమైంది. సంప్రదాయ పార్టీలు పాత పద్ధతుల్లో ఇంటింటి ప్రచారంపై ఆధారపడితే, విజయ్ డేటా అనలిటిక్స్ , సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల ద్వారా ఓటరు నాడిని పట్టుకున్నారు.
రాజకీయాల్లో న్యూ నార్మల్
ఈ విజయం కేవలం తమిళనాడుకే పరిమితం కాదు. ఇది దేశవ్యాప్త రాజకీయాలకు ఒక దిక్సూచి. ఇకపై గెలవాలంటే భారీ పత్రికా ప్రకటనలు, టీవీ చర్చల కంటే.. బలమైన సోషల్ మీడియా ఉనికి , క్షేత్రస్థాయిలో ఒక నిశబ్ద డిజిటల్ యంత్రాంగం ఉండటం అనివార్యం. కంటెంట్ క్రియేటర్లే ఇప్పుడు కొత్త తరం రాజకీయ ప్రచారకర్తలుగా మారుతున్నారు. విజయ్ విజయం ద్వారా డిజిటల్ స్పేస్‌ను శాసించిన వాడే.. రాజ్యాధికారాన్ని శాసిస్తాడు అనే కొత్త సూత్రం స్థిరపడింది.
విజయ్ సాధించిన ఈ విజయం ఒక సాంకేతిక విప్లవం. మీడియా మొఘలులు, వారసత్వ రాజకీయ నేతలు ఒక వైపు.. తన డిజిటల్ యంత్రాంగంతో ఒక కొత్త హీరో మరోవైపు తలపడ్డారు. చివరికి డిజిటల్ యుగం గెలిచింది. సంప్రదాయ మీడియా తన పంథా మార్చుకోకపోతే, భవిష్యత్తులో అది కేవలం గత కాలపు జ్ఞాపకం గా మిగిలిపోయే ప్రమాదం ఉంది.
